ఈ బిజీ ప్రపంచంలో ఫిట్నెస్ సాధించడానికి జిమ్ లలో గంటలు గంటలు కష్టపడాలా? లేదు మీ శరీరానికి, మనసుకు తక్షణ విశ్రాంతిని ఉల్లాసాన్ని ఇచ్చే అద్భుతమైన మార్గం మన చుట్టూనే ఉంది. అదే నడక! కానీ మనం సాధారణంగా నడిచే విధానానికి ఫిట్నెస్, మైండ్ రిఫ్రెష్ రెండూ సాధించడానికి ప్రత్యేకంగా నడవడానికి తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి? ఎలా నడిస్తే ఆ రెండు ప్రయోజనాలు మీ సొంతమవుతాయో తెలుసుకుందాం.
ఇలా నడిస్తే ఫిట్నెస్, మైండ్ రిఫ్రెష్ రెండూ! ఫిట్నెస్ మరియు మైండ్ రిఫ్రెష్ రెండూ పొందాలంటే మనం సాధారణ ‘నడక’ నుండి ‘మైండ్‌ఫుల్ వాకింగ్’ వైపు మారాలి. మైండ్‌ఫుల్ వాకింగ్ అంటే మీరు నడుస్తున్న ప్రతి క్షణాన్ని పూర్తిగా గమనించడం. మీ పాదాలు నేలను తాకుతున్నప్పుడు వచ్చే స్పర్శను, మీ శరీర భంగిమను, మీ చుట్టూ ఉన్న పరిసరాల సువాసనలు, శబ్దాలను గమనించండి.
మీ మనసులో పరుగెడుతున్న ఆలోచనలను పట్టించుకోకుండా మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. వేగంగా నడవడం ఎంత ముఖ్యమో, శ్రద్ధగా నడవడం అంతకంటే ముఖ్యం. ఈ పద్ధతిలో నడవడం వలన, మీ మానసిక ఒత్తిడి తగ్గి, మీ మెదడు ఉల్లాసంగా మారుతుంది. ఇది ధ్యానం లాంటిది, కానీ నడుస్తూ చేస్తారు.

ఫిట్‌నెస్‌కు సంబంధించి, మీరు కేవలం నెమ్మదిగా నడవకుండా పవర్ వాకింగ్ ను దినచర్యలో చేర్చాలి. పవర్ వాకింగ్ అంటే మీ సాధారణ వేగం కంటే కొంచెం వేగంగా, చేతులను ఊపుతూ పెద్ద అడుగులు వేస్తూ నడవడం. ఇలా చేయడం వలన మీ గుండె వేగం పెరుగుతుంది, క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. ముఖ్యంగా, మంచి ఫిట్నెస్ కోసం, మీ నడకలో ఇంటర్వెల్స్ పాటించండి.
అంటే 5 నిమిషాలు వేగంగా నడవడం ఆ తర్వాత 2 నిమిషాలు నెమ్మదిగా నడవడం వంటివి చేయడం వలన మీ జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది ఎక్కువ కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే ఎల్లప్పుడూ సరైన భంగిమ లో నడవండి. మీ వీపు నిటారుగా, భుజాలు వెనక్కి ఉండేలా చూసుకోండి.
మంచి ఫిట్నెస్ మరియు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం మీరు మీ నడకను కేవలం వ్యాయామంగా కాకుండా ఒక సంతోషకరమైన విరామంగా భావించాలి. వీలైతే ఉదయం లేదా సాయంత్రం, ప్రశాంతమైన పార్కులో లేదా పచ్చని ప్రకృతి మధ్య నడవడానికి ప్రయత్నించండి. ఇలా నడవడం వలన సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి లభించడమే కాకుండా తాజా గాలి మీ మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. నడక అనేది ఎటువంటి ఖర్చు లేని ఎటువంటి ఉపకరణాలు అవసరం లేని అద్భుతమైన మార్గం.
