మన దేశంలో రైతులు ఇప్పటికీ చాలా చోట్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలువలు, చెరువుల సదుపాయాలు లేని వారు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అయితే వాటికి విద్యుత్ అవసరం అవుతుంది. కానీ వ్యవసాయానికి అందే విద్యుత్ అంతంత మాత్రమే ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఆ రైతు భలే ఆలోచన చేశాడు. అదేమిటంటే…
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూర్‌ఖాబాద్‌లో ఉన్న రాజేపూర్ బ్లాక్‌లోని భుభియా భెడా అనే గ్రామంలో ఇటీవల వరదలు భారీగా సంభవించాయి. దీంతో అప్పటి నుంచి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆ గ్రామంలో విద్యుత్ సరిగ్గా ఉండడం లేదు. దీంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ అవస్థలు భరించలేని జోగేంద్ర సింగ్ అనే ఓ రైతు తన ట్రాక్టర్ ట్రాలీపై ఓ మొబైల్ సోలార్ పవర్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు. దాని సామర్థ్యం 2 కిలోవాట్లు. పగటిపూట తను తన పొలంతోపాటు ఇతరుల పొలాల వద్ద ఆ మొబైల్ సోలార్ పవర్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాడు. దీంతో వ్యవసాయానికి కావల్సిన విద్యుత్‌ను వారు పొందుతారు.
ఇక రాత్రి పూట జోగేంద్ర సింగ్ ఆ ట్రాలీని తెచ్చి ఇంటి వద్ద పెడతాడు. దీంతో అతని ఇంట్లోకి విద్యుత్ అందుతుంది. అలాగే గ్రామస్తులు ఫోన్లను చార్జింగ్ చేసుకునేందుకు అక్కడికి వస్తారు. ఇలా అతను ఆ మొబైల్ సోలార్ పవర్ బ్యాంక్ ద్వారా తాను లబ్ధి పొందుతూనే మరోవైపు గ్రామస్తులకు కూడా తన చేతనైనంత సహాయం చేస్తున్నాడు. ఇక ఆ గ్రామంలో విద్యుత్ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో చూడాలి..!