బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితర నేతలు ప్రత్యర్థులపై మాటలయుద్ధం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన తర్వాత.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 డివిజన్లు సాధించిన తర్వాత భారతీయ జనతాపార్టీ నేతలు చేస్తున్న హడావిడికి అంతేలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలోనే గెలుపొందగలిగారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో మిత్రపక్షాలు కూడా ఆ పార్టీకి దూరమవుతున్నారు.
ఎవరికి పట్టుందో తేలిపోయింది
నాలుగు ఎంపీస్థానాలు వచ్చినంత మాత్రాన ప్రజల్లో బలముందనుకుంటే ఎలా? తాజాగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరోచోట నాలుగోస్థానంలో నిలబడింది. ఇదీ ఆ పార్టీ బలం. ఎన్నికలతో గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం ఏదో ఒక అంశంమీదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంమీద ఆ పార్టీ దృష్టిపెట్టలేదని దీన్నిబట్టే అర్థమవుతోంది. అన్ని అంశాలపై కూలంకుషంగా ఆలోచించే పట్టభద్రల్లోనే పట్టులేదంటే సాధారణ ప్రజానీకంలో ఎలా పట్టుంటుంది? ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో చేస్తున్న అన్యాయం, తర్వాత బీహెచ్ ఈఎల్‌కు చేయబోయే అన్యాయం.. ఏదన్నాకానీ ఆ పార్టీని అధః పాతాళానికి తొక్కేశాయి.
క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి లేదు
కేంద్రంలో ఉన్న అధికారాన్ని, నరేంద్రమోడీని, అమిత్ షాను చూసుకొని తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యర్థులపై పదే పదే పసలేని విమర్శలు చేస్తున్నారు. ఏపీ మీద ఆ పార్టీ ఎటువంటి ఆశలు పెట్టుకోకపోయినా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోఅధికారంలోకి వస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవబోయేది తామేనంటున్నారు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని గెలవబోయేది కూడా తామేనని, అక్కడ వేంకటేశ్వరుడు తమకు ఆశీస్సులిచ్చాడంటున్నారు. గెలుపు సంగతి తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ఎన్నికలకు వెళితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు బీజేపీకి సూచిస్తున్నారు. కానీ ఆ సూచనలను పట్టించుకునే స్థితిలో ఆ పార్టీ నేతలెవరూ లేరు. ఇప్పటికే వారంతా కలల్లో విహరిస్తున్నారు… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోయేది తమ పార్టీయేనని, ముఖ్యమంత్రి అవబోయేది ఫలానా నేతేనని.