ఉద్యోగం కావాలా.. ఎస్‌ఐ ఏడుకొండలు సార్ పాఠాలు వింటే గ్యారెంటీ!

1041

లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ వారిలో చాలామందికి సరైన గైడెన్స్ లేక ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవుతున్నారు. మరికొంత మందికి సరైన శిక్షణ, మెటీరియల్ లేక ఫెయిల్ అవుతున్నారు. వీరందరికీ ఆశాజ్యోతిగా ఏడుకొండలు సార్ కన్పిస్తున్నారు. ఆయన పాఠాలు విని ఇప్పటివరకు 337 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. వివరాలు తెలుసుకుందాం…

Inspiration Yedukondalu Free Groups Coaching

నల్గొండలో ఎక్సైజ్ ఎస్‌ఐగా నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ ప్రైవేటు శిక్షణ సంస్థ వారు ఆయన్ను 2015లో అతిథి ఉపన్యాసం ఇవ్వాలంటూ ఆహ్వానించారు. ఉద్యోగం దక్కించుకోవాలన్న కసి, కన్నవారి కలలను సాకారం చేయాలన్న ఆకాంక్ష ఉంటే కొలువు సాధించడం పెద్దకష్టమేమీ కాదంటూ శిక్షణార్థులకు ప్రేరణ ఇచ్చారాయన. అతని బోధన విధానానికి ఆశ్చర్యపోయిన సన్నిహితుల కోరిక మేరకు.. బీసీ స్టడీ సర్కిల్‌లోని శిక్షణార్థులకు ఉచితంగా తరగతులు చెప్పారు. ఆ విద్యార్థుల్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి.

కోచింగ్ ఎందుకు ప్రారంభించారు?

ఉద్యోగ సాధన కోసం శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమతలేని వారి పరిస్థితి ఏంటీ? వెంటనే ఆయన తానే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండలో 2016లో ఉచిత శిక్షణను ప్రారంభించారు ఏడుకొండలు. ఉచిత శిక్షణ సంస్థను ప్రారంభించిన కొన్ని రోజులకే 500 మంది చేరారు. రెండు నెలల్లో ఆ సంఖ్య 1000 మంది చేరుకుంది. ప్రతి రోజు ఆయన విధులకు వెళ్లడానికి ముందు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు, విధులు ముగిసిన అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడం దినచర్యగా చేసుకున్నారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, జనరల్ అవేర్‌నెస్, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రం తదితర అంశాలపై ఆయనే సొంతంగా మెటీరియల్‌ను సిద్ధం చేసి బోధించేవారు. ఇతని ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వెయ్యి మందిలో తొలి సంవత్సరమే 129 మంది వివిధ ఉద్యోగాలను సాధించారు.

Inspiration Yedukondalu Free Groups Coaching

ఇలా నల్గొండలో శిక్షణ ఇస్తున్న సమయంలోనే 2017, నవంబరులో ఏడుకొండలుకు నాగర్‌కర్నూల్ సీఐగా బదిలీ అయింది. దీంతో శిక్షణ పొందుతున్న వారిలో ఆందోళన మొదలైంది. ఎలాంటి ఆందోళన చెందొద్దని వారికి పూర్తి భరోసా ఇచ్చారు. నాగర్‌కర్నూల్ సీఐగా విధుల్లో చేరి.. ఇక్కడ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే అక్కడి శిక్షణార్థులకు ఆన్‌లైన్‌లో హెచ్‌డీ స్క్రీన్ ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రాంభించారు. అటు నల్గొండలోని శిక్షణార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూనే ఇటు నాగర్‌కర్నూల్‌లో నేరుగా శిక్షణ మొదలుపెట్టారు ఈసారి మరో 80 మందికిపైగా పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో, ఎఫ్‌బీవో, ఎస్‌ఐ తదితర ఉద్యోగాలను సాధించారు. 2018లోనూ అదే శిక్షణ పంథా అవలంబించారు. ఇటీవల కూడా ఆయన శిక్షణ ఇచ్చిన పది మంది ఎస్‌ఐలుగా కొలువులు సాధించారు.

READ ALSO  ఈ కోడి నిజంగా బంగారు కోడిపెట్టే.. ఎందుకో తెలుసా..?

ఆయన పైసలతోనే కోచింగ్ ఖర్చులు

ఈ విషయం ఉద్యోగాలు సాధించినవారి ద్వారా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏడుకొండలు ఇస్తున్న శిక్షణ మాట ఇతర జిల్లాలకూ వ్యాపించింది. ఉమ్మడి ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచీ నిరుద్యోగులు వచ్చి శిక్షణకు హాజరవుతున్నారు. ప్రైవేటు వసతి గృహాలు, గదులను అద్దెకు తీసుకొని మరీ ఏడుకొండలు ఇస్తున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన 10 పట్టణాల్లో 15 చోట్ల ఆన్‌లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.

దీనికయ్యే ఖర్చంతా ఆయనే భరిస్తున్నారు. ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వడానికి హెచ్‌డి తెరలు, ఇతర పరికరాల కోసం రూ. 20 లక్షల ఖర్చయింది. ఈ డబ్బుకోసం రూ. 10 లక్షలను వ్యక్తిగత రుణం తీసుకోవడంతోపాటు రూ. 5 లక్షలను తన జీపీఎఫ్ నుంచి సమకూర్చుకున్నారు. విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తానంటే తన తల్లి రూ. 3 లక్షలు, తన సోదరుడు, శ్రీనివాస్(ఎస్‌ఐ) రూ. 2 లక్షలను ఆనందంగా అందజేశారు. ఈ మొత్తంతో ఆన్‌లైన్ శిక్షణకు అవసరమయ్యే హెచ్‌డీ తెరలు, పరికరాలను కొనుగోలు చేశారు. ప్రతి నెలా రూ. 15,000 ఇంటర్‌నెట్ బిల్లు వస్తుంది. ఈ మొత్తాన్ని ఆయనే భరిస్తున్నారు.

ఎవరీ ఏడుకొండలు

ఏడుకొండలుది నల్లగొండ నాగార్జునసాగర్‌కు దగ్గర్లోని పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామం. సాధారణ వ్యవసాయ కుంటుంబం. చిన్ననాడు సగటు విద్యార్థి. ఎనిమిదో తరగతి పూర్తవగానే బడి మానేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం ప్రారంభించారు. సంవత్సరం పాటు పాఠశాలకు దూరంగానే ఉన్న తరువాత లీనస్ అనే ఉపాధ్యాయుడు.. ఈ డ్రాపవుట్ విద్యార్థిని మళ్లీ పాఠశాలలో చేర్పించారు. చదువు విలువ చెప్పి పాఠాలు బోధించారు.

అనంతరం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తవగానే 2003లో జైలు వార్డరు ఉద్యోగానికి ఎంపికయ్యారు. విశాఖపట్నంలో జైలు వార్డరుగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండానే 2007లో ఆబ్కారీ శాఖలో కొలువు సంపాదించారు. నల్గొండలో ఎక్సైజ్ ఎస్‌ఐగా నియమితులయ్యారు. తరవాత కొన్ని సంవత్సరాలకు సీఐగా పదోన్నతి పొంది అక్కడే కొనసాగారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

– కేశవ