కొబ్బరికాయలను పొట్టు తీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బయట కొబ్బరిబొండాలను అమ్మేవారు వాటి పొట్టు తీసేందుకు చాలా కష్టపడుతారు. ఇక సాధారణ టెంకాయలకు కూడా పొట్టు తీయడానికి కార్మికులు చాలా శ్రమిస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఆ వ్యక్తి అభివృద్ధి చేసిన ఆ యంత్రంతో కేవలం 40 సెకన్లలోనే కొబ్బరికాయకు పొట్టు తీయవచ్చు. అంతేకాదు.. కొబ్బరి, అందులో ఉండే నీరు అలాగే ఉంటుంది. వినియోగదారులు చిన్న కత్తితో ఒక రంధ్రం పెట్టి చాలా సులభంగా అందులో నుంచి నీటిని తీసుకోవచ్చు. చాలా సులభంగా ఆ కొబ్బరిని ఉపయోగించుకోవచ్చు. తినవచ్చు.
కేరళలోని త్రిశూర్‌కు చెందిన కంజని గ్రామ వాసి కేసీ సిజోయ్ అక్కడి నెట్టూర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఫౌండేషన్ (ఎన్‌టీటీఎఫ్)లో టూల్ అండ్ డై మేకింగ్ కోర్సు చదివాడు. తరువాత సౌదీ వెళ్లి కొంత కాలం పనిచేసి తిరిగి సొంత ఊరికి వచ్చాడు. అయితే కొబ్బరికాయలను చాలా సులభంగా పొట్టు తీసే యంత్రం తయారు చేయాలని అనిపించింది. వెంటనే పనిమొదలు పెట్టాడు. అనేక సంస్థలకు వెళ్లి రీసెర్చ్ చేశాడు. అప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యంత్రాలను పరిశీలించాడు. చివరకు 10 ఏళ్ల పాటు ఎంతగానో కష్టపడి 500 వాట్ల మోటార్ సామర్థ్యం కలిగిన ఓ యంత్రాన్ని తయారు చేశాడు. అది కేవలం 40 సెకన్లలోనే కొబ్బరికాయలను పొట్టు తీస్తుంది.
ఇక తన యంత్రానికి 2015లో పేటెంట్‌కు అప్లై చేయగా 2017లో పేటెంట్ లభించింది. అయితే కొబ్బరికాయలు భిన్న రకాల సైజుల్లో ఉంటాయి కనుక అందుకు తగిన విధంగా మోటార్‌ను కూడా మార్చాడు. అందులో 750 వాట్ల సామర్థ్యం ఉన్న మోటార్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో అంతకు ముందు గంటకు 40 నుంచి 50 కొబ్బరికాయలకు పొట్టు తీసేవాడు. కానీ కొత్త మోటార్‌ను ఏర్పాటు చేశాక గంటకు 60 నుంచి 80 కొబ్బరికాయలకు పొట్టు తీసే వీలు ఏర్పడింది.
కాగా సిజోయ్ తన యంత్రంతో కొబ్బరికాయలకు పొట్టు తీస్తూ అలాంటి ఒక్కో కాయను మార్కెట్‌లో రూ.30కి విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే కూకోస్ అనే పరిశ్రమను సొంతంగా ఏర్పాటు చేశాడు. దాని ద్వారా పొట్టు తీసిన కొబ్బరికాయలను విక్రయిస్తున్నాడు. వాటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. అయితే సిజోయ్ తయారు చేసిన ఆ యంత్రానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్నోవేషన్ రివార్డు కింద రూ.25 లక్షల గ్రాంట్‌ను కూడా అందజేసింది. ఈ క్రమంలోనే అతను ఆ యంత్రానికి మరిన్ని మార్పులు, చేర్పులు చేసి త్వరలోనే వాణిజ్య పరంగా వాటిని విక్రయించనున్నాడు. సిజోయ్ అంతటి అద్భుతమైన యంత్రాన్ని తయారు చేసినందుకు గాను అందరూ అతన్ని అభినందిస్తున్నారు.