బంతిపూల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న మంచిర్యాల రైతు..!

హిందువులు ప్ర‌తి శుభ కార్యంతోపాటు పండుగలు, ఉత్స‌వాల స‌మ‌యాల్లో బంతి పూల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. తోర‌ణాల‌ను అలంక‌రించ‌డం మొద‌లు కొని పూజ‌ల వ‌ర‌కు, ఇత‌ర కార్యాల్లోనూ ఎక్కువ‌గా ఈ పూలను ఉపయోగిస్తారు. అయితే నిజానికి ఈ పూల‌ను చాలా త‌క్కువ మంది పెంచుతున్నారు. కానీ క‌ష్ట‌ప‌డితే ఈ పూల‌ను పెంచడం ద్వారా ఎక్కువ‌గా ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మంచిర్యాల‌ జిల్లా ల‌క్షెట్టి పేట మండ‌లం కొత్తూరు గ్రామానికి చెందిన పెండ్యాల శ్రీ‌నివాస్ బంతిపూల‌ను సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

mancherial farmer marigold flowers farming

శ్రీ‌నివాస్ ఎమ్మెల్సీ జువాల‌జీ చ‌దివాడు. కానీ వ్య‌వ‌సాయంపై మ‌క్కువ ఎక్కువ‌. అయితే సాంప్ర‌దాయ పంట‌ల‌కు భిన్నంగా ఇత‌ను పూల‌ను సాగు చేయ‌డంపై దృష్టి పెట్టాడు. త‌క్కువ కాలంలోనే ఎక్కువ లాభాల‌ను ఇచ్చే బంతి పూలను ఇత‌ను సాగు చేస్తున్నాడు. 2012 నుంచి ఇత‌ను పూల‌ను సాగు చేయ‌డం మొద‌లు పెట్టాడు. 6 ఎక‌రాల విస్తీర్ణంలో ప‌త్తి, కూర‌గాయ‌ల‌కు తోడుగా ప‌సుపు, ఎరుపు రంగులో ఉండే బంతి పూల‌ను సాగు చేయ‌డం మొద‌లు పెట్టాడు.

ఇక శ్రీ‌నివాస్ త‌న పంట‌ల‌కుగాను కేవ‌లం సేంద్రీయ ఎరువుల‌నే వాడుతున్నాడు. ఆవు పేడ, మూత్రంతో సేంద్రీయ ఎరువుల‌ను పంట‌ల‌కు వాడుతూ దిగుబ‌డి ఎక్కువ‌గా సాధిస్తున్నాడు. పంట‌ల ద్వారా అధిక లాభాలు పొందుత‌న్నాడు. సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను సాగు చేయ‌డాన్ని ఇత‌ను యూట్యూబ్‌తోపాటు ప‌లు మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాడు. అనేక పుస్త‌కాలు చ‌దివాడు. త‌రువాత వ్య‌వ‌సాయంలోకి దిగాడు. ప్ర‌స్తుతం బంతిపూల సాగుతో అధిక ఆదాయం సంపాదిస్తున్నాడు.

అయితే పూల సాగు ద్వారా లాభాలు వ‌చ్చే మాట నిజ‌మే అయినా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో సాగు చేయాల‌ని శ్రీ‌నివాస్ చెబుతున్నాడు. అలాగే విత్త‌నాలు నాటిన ద‌గ్గ‌ర్నుంచీ పూలు చేతికొచ్చే వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, కొద్దిగా క‌ష్ట‌ప‌డితే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే పంట చేతికి వ‌స్తుంద‌ని అంటున్నారు. బంతి పూల సాగు ద్వారా పూలు కేవ‌లం 90 నుంచి 100 రోజుల్లోనే చేతికొస్తాయి. ఇక వీటికి ప్ర‌తి సీజ‌న్‌లోనూ డిమాండ్ ఉంటుంది. క‌నుక ఈ పూల సాగు లాభ‌సాటిగా ఉంద‌ని శ్రీ‌నివాస్ చెబుతున్నాడు.