12 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు చెప్పండి. ఏడో తరగతో.. ఎనిమిదో చదువుతూ.. తన బాల్యాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ.. ఈ బాలుడు అలా కాదు. 12 ఏళ్లకే.. పర్యావరణాన్ని రక్షించడానికి పూనుకున్నాడు. తలలు పండిన పరిశోధకులు కూడా చేయలేని పనిని చేసి ఔరా అనిపించాడు.
12 ఏళ్ల హాజిక్ కాజి… ఎర్విస్ అనే షిప్ ను డిజైన్ చేశాడు. అది సముద్రంలోని వ్యర్థాలను, ప్లాస్టిక్ ను తొలగిస్తుంది. తను తయారు చేసిన షిప్ గురించి అంతర్జాతీయ ప్లాట్ ఫామ్స్ అయిన టెడ్ ఎక్స్, టెడ్ 8 లో వివరించాడు.
సముద్రాల్లో ఉండే వ్యర్థాల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో నేను కొన్ని డాక్యుమెంటరీల్లో చూశాను. దీని వల్ల సముద్ర జీవులకు ఎంతో ప్రమాదం వాటిల్లుతోంది. పర్యావరణం దెబ్బతింటోంది. జీవ వైవిధ్యం నాశనమవుతోంది. ఈ పర్యావరణానికి నావంతు కృషిగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మనం తినే చేపలు సముద్రంలోని ప్లాస్టిక్ ను తింటున్నాయి. కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో నేను ఎర్విస్ ను తయారు చేశాను.
ఎర్విస్ షిప్ సముద్రంలోని నీళ్లను లోపలికి తీసుకొని.. నీటిలోని వ్యర్థాలను వేరు చేస్తుంది. ఆ నీటిని తిరిగి సముద్రంలోకి పంపి… ఆ నీటి ద్వారా వచ్చిన చెత్తను షిప్ లో పడేస్తుంది. ఈ షిప్ సెన్సార్ ప్రకారం పనిచేస్తుంది. సెన్సార్ షిప్ లోకి చేర్చిన చెత్తను దాని సైజ్ ప్రకారం వేరు చేస్తుంది. షిప్ కింద అమర్చిన సెన్సార్లు.. సముద్రంలో ఉన్న చెత్తను గ్రహించి… షిప్ లోపలికి పంపిస్తాయి.
కాజీకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈ షిప్ ఐడియా వచ్చిందట. అప్పటి నుంచి దానికి ఓ రూపం తీసుకురావడానికి కాజీకి ఇంత సమయం పట్టింది. ఓవైపు చదువుకుంటూనే కాజీ… కొన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ఫోరమ్ లతో కలిసి… సముద్రంలోని ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు, ప్లాస్టిక్ ను రూపుమాపడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.