అమరుల కుటుంబాలకు తన గాజులమ్మి సాయం చేసింది..!

-

దేశమంతా ఒక్కటయింది. ఎవరినోట చూసినా పుల్వామా దాడి గురించే చేర్చ. అంత హేయమైన చర్యను ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఎలాగైనా ఆదుకోవాలని ప్రతి భారత పౌరుడు ఆరాటపడుతున్నాడు. తమకు తోచిన సాయం.. చేతనైన సాయాన్ని అమరుల కుటుంబాలకు అందిస్తున్నారు. తమ వంతుగా ఈ దేశానికి వాళ్లు చేయగలిగే సాయం అదే. ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందించారు. వాళ్లు కూడా విరాళాలు అందించారు.

అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ కూడా పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలనుకున్నది. కానీ.. ఆమె దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తన చేతికి ఉన్న గాజులను అమ్మేసి.. దానికి బదులుగా వచ్చిన డబ్బును ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేసింది. ఆమె చేతి గాజులను అమ్మితే.. 1,38,387 రూపాయలు వచ్చాయి. వాటిని అమరుల కుటుంబాలకు అందించాలంటూ ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు లేఖ కూడా రాసింది. ప్రస్తుతం ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె గొప్ప మనసును మెచ్చిన నెటిజన్లు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ప్రతి భారత పౌరుడు కూడా ఆ ప్రిన్సిపల్‌లా ఆలోచించి.. ఎంతో కొంత ఇచ్చి జవాన్ల కుటుంబాలను ఆదుకుంటే.. అంతకంటే మనం ఈ దేశానికి ఇవాల్సింది ఏదీ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రిన్సిపల్‌జీ మీకు హేట్సాఫ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version