జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పడు అంతా శూన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది. అప్పటివరకూ కన్న కలలు పేకమేడల్లా కూలిపోతాయి. ఇక లైఫ్ అయిపోయిందని నిరాశతో బతికేస్తారు కొందరు. కానీ మరికొందరు మాత్రం..ఆ చేదు అనుభవాలనుంచే.. మరింత దృఢంగా తయారవుతారు. ఎగిసిపడే కెరటంలా దూసుకెళ్తారు. ఓ ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయిన ఈ యువతి ఎంతోమందికి ఆదర్శం. చిన్నతనం నుంచే సినిమాలను ప్రేమించే ఆమె..అదే రంగంలో దూసుకెళ్తుంది. టర్కీకి చెందిన దర్శకనిర్మాత లీసా కలాన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.!
లీసా కలాన్.. టర్కీలోని దియార్‌బాకిర్ సిటీలో 1987లో రాజకీయ నేపథ్యం ఉన్న కుర్దిష్ కుటుంబం జన్మించింది. అయితే తన చిన్నతనంలో తన ప్రాంతం అణచివేతకు గురవడంతో ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడిందట.. తన మాతృభాషలో ఉన్నత విద్యను అభ్యసించే వీల్లేక.. టర్కిష్ భాషలో తనకు చదివే అర్హత లేకపోవడంతో హైస్కూల్ విద్యతోనే చదువు ఆపేసింది. చిత్రరంగంలో స్థిరపడాలని ఆ వయసులోనే అనుకుంది.
ఈ క్రమంలోనే ‘ఆరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినీ రంగంలో అరంగేట్రం చేసింది. అదృష్టవశాత్తూ ఈ కోర్సును తన మాతృభాషలోనే బోధించడం ఆమెకు కలిసొచ్చింది. అయితే రెండేళ్ల అనంతరం పలు కారణాల వల్ల తాను శిక్షణ పొందే కన్జర్వేటరీని మూసేశారు. అయినా ఈ రెండేళ్ల కాలంలోనే సినిమా గురించి బోలెడన్ని నైపుణ్యాలు/విషయాలు నేర్చేసుకుంది లీసా..తన ప్రాంత వాసుల సమస్యలు, అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న సవాళ్లే తన సినిమాకు కథాంశాలుగా మలుచుకుంది. ఈ క్రమంలో కుర్దిష్ కమ్యూనిటీ ప్రజల జీవనశైలి, కొండ ప్రాంతాల్లో నివసించే తమ ఆచార వ్యవహారాల్ని, అక్కడి మహిళల వెతల్ని.. లఘుచిత్రాలుగా, డాక్యుమెంటరీలుగా రూపొందించి ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇలా సినిమా రంగంలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ వస్తున్న తన జీవితంలో విధి తనను చిన్న చూపు చూసింది. 2015, జూన్ 5న నిర్వహించిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొంది లీసా. ఇదే అదనుగా భావించిన ఐసిస్ ఉగ్రవాదులు పార్టీని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు చేశారు. ఈ పేలుళ్లలో లీసా తన రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో పాటు తీవ్ర గాయాల పాలైంది.
ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు లీసా చికిత్స కోసం నిధులు సమీకరించారు. ఈ క్రమంలోనే టర్కీ, జర్మనీల్లో ఆమెకు సుమారు తొమ్మిదిసార్లు శస్త్రచికిత్సలు చేశారు.. అయినా తన కాళ్లను తిరిగి పొందలేకపోయింది. జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైంది.. ఆ సమయంలో..తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. ఈ క్రమంలో.. ఓ వైద్యుడు ఆమె కాళ్లకు టైటానియం ఇంప్లాంట్స్‌ని అమర్చి.. ఆమె కోసం ప్రత్యేకంగా ప్రోస్థటిక్ కాళ్లను తయారుచేయించారు. దీంతో అప్పట్నుంచి పెట్టుడు కాళ్లతోనే తన కెరీర్‌ని కొనసాగిస్తోంది లీసా.
శస్త్రచికిత్సలు, ఇతర ట్రీట్‌మెంట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు ఆరేళ్ల పాటు కెరీర్‌కి దూరమైన లీసా..ఆ తర్వాత నుంచి రెట్టింపు ఉత్సాహంతో కెరీర్ ను మళ్లీ ప్రారంభించింది. ‘ది టంగ్ ఆఫ్ ది మౌంటెయిన్స్’, ‘డ్రాప్’, ‘ది బటర్‌ఫ్లై దట్ క్రియేట్స్ ఇట్‌సెల్ఫ్’.. వంటి సినిమాల్ని రూపొందించి, నిర్మించింది.. మరికొన్ని సినిమాల్లో నటించింది కూడా. అంతేకాదు.. ఈమధ్యే వర్చువల్ రియాల్టీ (వీఆర్) టెక్నాలజీతో మరో చిత్రాన్ని కూడా రూపొందించింది లీసా. ఏదేమైనా బాంబు దాడి తర్వాత తాను ప్రపంచాన్ని చూసే దృష్టి కోణం మారిందని చెబుతోందీ ఫేమస్ డైరెక్టర్.
అయితే తాను రాసి, దర్శకత్వం వహించిన ‘ది టంగ్ ఆఫ్ ది మౌంటెయిన్స్’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలందుకుంది.. ఇక తాజాగా ‘కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవా’ల్లోనూ దీన్ని ప్రదర్శించారు. ఇలా జీవితం తనకు విసిరిన సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటూ.. చిత్ర రంగంలో తాను చేస్తోన్న కృషికి గుర్తింపుగా ఈ చిత్రోత్సవాల్లో ఆమెను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డు’తో సత్కరించారు. ఈ అవార్డును కొత్తగా ప్రవేశపెట్టడం, తొలి విడతలోనే లీసా దీన్ని అందుకోవడం చాలా గొప్ప విషయం కేరళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకుంది.
శారీరక లోపాలున్న వారిని ఈ సమాజం ఏమీ చేతకాని వారిలా చూస్తుంది. వారిపై జాలిపడటం తప్ప ఏం చేయలేరు. ట్రై సైకిల్లు, పింఛన్లు ఇవ్వడంతోనే మన పని అయిపోయిందని కాకుండా.. చేయూతను అందించి.. వారు ఏ రంంగలో నిష్ణాతులు అవ్వాలనుకున్నారో తెలుసుకుని.. ఆ దిశగా అడుగులు వేసేందుకు కుటుంబం, ప్రభుత్వాలు సాయం అందిస్తే..సాటి మనుషులుకు వీరేం తక్కువ కాదని నిరూపించుకోలుగుతారు. ఈమె విజయగాథ ఏంతో మందికి ఆదర్శం.