పేద క్యాన్స‌ర్ రోగుల పాలిట దేవుళ్లు.. ఈ దంప‌తులు..!

-

స‌మాజం అంటే కేవ‌లం మ‌నం మాత్ర‌మే బ‌త‌కడం కాదు.. మ‌న చుట్టూ ఉన్న‌వారిని కూడా బ‌తికించడం. అందుకు అవ‌స‌రం అయితే ఎంత క‌ష్టానికైనా వెనుకాడ‌కూడ‌దు. తోటి వారిని ఆదుకునేందుకు మ‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేయాలి.. అవును.. స‌రిగ్గా ఈ విష‌యాల‌ను న‌మ్మాడు క‌నుక‌నే ఆయ‌న క్యాన్సర్ రోగుల పాలిట దేవుడ‌య్యాడు. గ‌త 27 సంవ‌త్స‌రాలుగా క్యాన్స‌ర్ పేషెంట్ల‌కు నేనున్నానంటూ ధైర్యం చెబుతూ.. వారికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు. అంతేకాదు.. క్యాన్స‌ర్ రోగుల‌లో ఆయ‌న మ‌నోధైర్యాన్ని నింపుతున్నాడు. ఆయ‌నే.. పూణెకు చెందిన రిటైర్డ్ క‌ల్న‌ల్ న్యాయ‌ప‌తి..

this retired army man and his doctor wife giving another life to poor cancer patients

పూణెకు చెందిన ఎన్ఎస్ న్యాయ‌ప‌తి త‌ల్లి 1989లో కిడ్నీ క్యాన్స‌ర్‌తో చ‌నిపోయింది. అయితే ఆ స‌మ‌యంలో దేశంలో క్యాన్స‌ర్ చికిత్స కోసం స‌రైన వ‌స‌తులు లేవు. దీనికి తోడు ఆ స‌మ‌యంలో ఆమె తీవ్ర‌మైన నొప్పి, బాధ‌తో చివ‌రి వ‌ర‌కూ క్యాన్స‌ర్‌తో పోరాడుతూ మృతి చెందింది. దీంతో న్యాయ‌ప‌తి తీవ్ర మ‌న‌స్థాపానికి లోన‌య్యారు. అయితే అప్ప‌టికే ఆయ‌న ఆర్మీలో క‌ల్న‌ల్‌గా కొన‌సాగుతున్నారు. కానీ ఆ జాబ్‌కు ఆయ‌న‌ ముందుగానే రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. 1993లో త‌న భార్య డాక్ట‌ర్ మాధురి కావూరితో క‌లిసి పూణెలో ఒక చిన్న గ‌దిలో కేర్ ఇండియా మెడికల్ సొసైటీ (సీఐఎంఎస్‌)ను ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఆ సంస్థ ద్వారా పేద‌ క్యాన్స‌ర్ పేషెంట్ల‌కు ఆయ‌న స‌హాయం అందిస్తూ వ‌స్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సీఐఎంఎస్ ద్వారా 38వేల మంది క్యాన్స‌ర్ రోగుల‌కు ఆ దంప‌తులు చికిత్స‌ను అందించి వారికి పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించారు. అయితే మొద‌ట్లో వారికి డ‌బ్బుకు చాలా క‌ష్టంగా ఉండేది. ఎందుకంటే క్యాన్స‌ర్ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తం వీరే భ‌రించాలి కాబ‌ట్టి.. అది కోట్ల‌లో అవుతుంది కాబ‌ట్టి.. వారికి డ‌బ్బు దొర‌క‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే రాను రాను వీరు చేస్తున్న మంచి ప‌నుల‌కు చ‌క్క‌ని ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో దాతలు ముందుకు వ‌చ్చారు. ఇక అప్పటి నుంచి సీఐఎంఎస్ నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తూనే ఉంది.

ఇక సీఐఎంఎస్ ద్వారా రోగుల‌కు కావ‌ల్సిన క్యాన్స‌ర్ చికిత్స‌ను ఆ దంప‌తులు ఉచితంగా అందించ‌డ‌మే కాదు.. వారిలో మ‌నోధైర్యాన్ని నింపుతున్నారు. మీకు మేమున్నామంటూ చేయందిస్తున్నారు. సాధార‌ణంగా క్యాన్స‌ర్ పేషెంట్లు తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు లోన‌వుతుంటారు. కానీ సీఐఎంఎస్‌లో పేషెంట్ల‌కు మాన‌సిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చికిత్స చేస్తారు. దీంతో పేషెంట్లు తాము ఎప్పుడూ రోగుల‌ము కాద‌ని ఫీల‌వుతారు. అదే వారిలో కొండంత ఆత్మ‌స్థైర్యాన్ని నింపుతుంది. దీంతో వారు వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

కాగా సీఐఎంఎస్ ఇప్పుడు పూణె మాత్ర‌మే కాదు, మ‌హారాష్ట్ర వ్యాప్తంగా త‌న సేవ‌ల‌ను విస్తృత ప‌రుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అవ‌స‌రం ఉన్న‌వారికి మందుల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌డంతోపాటు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం ఉన్న‌వారిని న‌గరానికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. ఇంత చేస్తున్నా.. న్యాయ‌ప‌తి దంప‌తులు మాత్రం ఇప్ప‌టికీ ఎంతో నిరాడంబ‌రంగా ఉంటారు. అలాగే ఇప్పుడు వారు వృద్ధాప్యంలో ఉన్నా.. త‌మ చివ‌రి శ్వాస ఉన్నంత వ‌ర‌కు పేద రోగుల‌కు స‌హాయం అందిస్తూనే ఉంటామ‌ని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఆ దంప‌తులు చేస్తున్న సేవ‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news