
ఎవరైనా నేరం చేస్తే వాళ్లను బొక్కలో తోస్తారు. అంటే జైలులో వేస్తారు. ఎందుకు అంటే.. అక్కడే కొన్నేళ్ల పాటు వాళ్లను ఉంచి.. వాళ్లకు కష్టాలు పెట్టి వాళ్లలో మార్పును తీసుకురావడానికి. అందుకే జైలులో అన్ని సౌకర్యాలు ఉండవు. ఎక్కడైనా అవే రూల్స్ ఉంటాయి. కానీ.. ఒక్క జైలు మాత్రం మిగితా జైళ్లన్నింటిలోనూ డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే.. అది జైలు కాదు స్వర్గం.. భూతల స్వర్గం.. కాదు కాదు అంతకు మించి. ఒక్కరోజైనా ఆ జైలులో గడపాలని ప్రతి ఖైదీ కోరుకుంటాడు. షాక్ అయ్యారా? ఇంతకీ ఆ జైలు ఎక్కడుందంటారా? అయితే.. ఓసారి నార్వే వెళ్లొద్దాం పదండి.

నార్వేలోని బాస్టాయ్ జైలు అది. పెద్ద పెద్ద గోడలు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, ఖైదీల కోసం చీకటి రూములు, సెక్యూరిటీ.. ఇలాంటివేమీ ఆ జైలులో కనిపించవు. ఎందుకంటే.. ఏ ఖైదీ పారిపోవడానికి ప్రయత్నించడు కాబట్టి. జైలులో ఉండే అధికారులు, పోలీసులు, ఖైదీలు అంతా ఒకే సమయపాలన పాటిస్తారు. పొద్దున్నే అంతా లేస్తారు. అందరూ ఎక్సర్ సైజ్ చేస్తారు. తర్వాత టిఫిన్ చేసి.. పక్కనే ఉన్న బీచ్ కు వెళ్లి కాసేపు సేదతీరుతారు. తర్వాత జైలుకు వచ్చి జైలులో ఉండే పనులు చూసుకుంటారు. వ్యవసాయం చేస్తారు. గొర్రెలను పెంచుతారు. తర్వాత ఎవరికి నచ్చిన వంట వాళ్లు చేసుకొని తింటారు. మళ్లీ తమ పనులు చేసుకుంటారు. సాయంత్రం ఓసారి మళ్లీ బీచ్ లో గడుపుతారు. రాత్రి భోంచేసి పడుకుంటారు. ఇదే ఆ జైలులోని ఖైదీల దైనందిన జీవితం.

ఇన్ని ఫెసిలిటీలు ఉన్న జైలుకు ఖైదీలు రావాలంటే పెద్ద ప్రాసెసే ఉందండోయ్. చిన్ని చిన్న నేరాలు చేసిన వాళ్లు.. ఓ ఏడాది పాటు ఏదైనా ఇతర జైళ్లలో శిక్ష అనుభవించిన వాళ్లు మాత్రమే ఈ జైలుకు వెళ్లేందుకు అప్లికేషన్ పెట్టుకోవచ్చట. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్లను ఈ జైలులోకి తీసుకోరట. ఖైదీల్లో మార్పు తీసుకురావడానికే ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తారట జైలులో. అది కూడా ఒక్కసారి నేరం చేసిన వాళ్లకే ఈ జైలులో చాన్స్. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు నేరం చేస్తే ఆ జైలుకు వెళ్లడం కుదరదు. అది ఆ జైలు స్పెషాలిటీ.

