చాలామందికి ఓవర్ థింకింగ్ సమస్య ఉంటుంది. వద్దూ వద్దూ అనుకుంటూనే అనవసరం లేకున్నా వాటిపై ఆలోచిస్తాం.. ఇష్టం లేని వ్యక్తుల గురించి పదే పదే ఆలోచించాల్సి ఉంటుంది. ఈ అడ్డూ అదుపులేని ఆలోచనలు మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నిరంతరం ఆలోచనల కారణంగా ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అయితే కొన్ని మార్గాల ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు…
నెగిటివ్ ఆలోచనలను సవాల్ చేయాలి
మీ గురించి మీరు తక్కువ చేసుకుంటూ నెగిటివ్‌గా ఆలోచిస్తుంటే.. వాటిని సవాలు చేయండి. అలాంటి ఆలోచనలను అధిగమించాలని మనసులో బలంగా అనుకోండి. మిమ్మల్ని శక్తివంతం చేసే ఆలోచనలతో రీఫ్రేమ్ చేయండి. దీంతో మీలో ఏదైనా మార్పు వచ్చిందో లేదో గమనించండి.
ప్లాన్ ప్రకారం అడుగులు వేయాలి
ఓవర్ థింకింగ్ వల్ల ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. అయితే ఈ స్థితి నుంచి బయటపడ్డానికి ప్రణాళికాబద్ధమైన దిశలో ముందుకు వెళ్లొచ్చు.. మిమ్మల్ని నియంత్రించే అన్ని రకాల నెగిటివ్ ఆలోచనలను వదిలేయండి.. ఇందుకోసం మీకు నచ్చిన పని పైన దృష్టి సారించండి. మీకు నచ్చిన పని చేస్తే మీ దృష్టి అంతా దానిపైనే ఉంటుంది. దీంతో మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు అతిగా ఆలోచిస్తున్నప్పుడల్లా, ఆ సమయంలో ఏం చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందో దానిపై దృష్టి పెట్టండి.
అంగీకారం..
అంగీకారం అంటే ఆలోచనలు అలాగే ఉండేందుకు అనుమతించడం, అవి పోవాలని కోరుకోకపోవడం. ఈ వైఖరి ఓవర్ థింకింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడంలో మీకు హెల్ప్ అవుతుంది. ఓవర్ థింకింగ్‌పై మీ ప్రతిస్పందన అవసరం లేదని అర్థం చేసుకోవడానికి కూడా అంగీకారం మీకు సహాయపడుతుంది. దీంతో మీ సమయం, శక్తిని ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి.
స్వీయ కరుణ
మనం ఎదుర్కొనే ఏదైనా సమస్యకు మన అంతరంగం ఎలా స్పందిస్తుందో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. మీ పట్ల కనికరం అంటే ప్రేమ, క్షమాపణ, దయను పెంచుకోవడం. స్వీయ కరుణ అనేది శరీరం అంతర్గత ముప్పు వ్యవస్థను స్మూత్‌గా డీల్ చేస్తుంది. దీంతో సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించే స్పష్టమైన మనసు మీ సొంతం అవుతుంది.