కొలంబియాలో డెంగీ దోమలను అరికట్టేందుకు డెంగీ దోమలనే అక్కడి మున్సిపల్ అధికారులు బయటకు వదులుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అవి సాధారణ డెంగీ దోమలు కాదు. మార్చబడిన డెంగీ దోమలు.
సాధారణంగా మన దేశంలో వర్షాకాలం సీజన్ రాగానే డెంగీ లాంటి విష జ్వరాలు ప్రబలుతుంటాయి. దీంతో రోజు రోజుకీ పెరిగిపోయే డెంగీ కేసులతో ప్రభుత్వాలు కూడా తలలు పట్టుకుంటుంటాయి. ఖరీదైన వైద్యం చేయించలేని పేదలు ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఇది మన దేశంలో ఏటా జరిగే విషయమే. అయితే కొలంబియా దేశంలో నిజానికి మనకంటే డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. మరి వారు డెంగీని అరికట్టేందుకు ఎలాంటి వినూత్నమైన పద్ధతిని పాటిస్తున్నారో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..!
కొలంబియాలో డెంగీ దోమలను అరికట్టేందుకు డెంగీ దోమలనే అక్కడి మున్సిపల్ అధికారులు బయటకు వదులుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అవి సాధారణ డెంగీ దోమలు కాదు. మార్చబడిన డెంగీ దోమలు. వాటిల్లోకి వోల్బాచియా అనే బాక్టీరియాను ఎక్కించి వదులుతున్నారు. దీంతో డెంగీ దోమలలో డెంగీ జ్వరాన్ని కలిగించే వైరస్ నాశనమవుతుంది. అలాగే ఆ దోమలు ఇతర దోమలతో కలసినప్పుడు ఇతర దోమలలోకి కూడా వోల్బాచియా బాక్టీరియా వెళ్తుంది. దీంతో ఆ దోమలు కూడా మారుతాయి. అలాగే వాటికి పుట్టే దోమలు కూడా సాధారణ దోమల్లాగే ఉంటాయి తప్ప.. డెంగీ దోమల్లా ఉండవు. ఇలా డెంగీ దోమలను అక్కడి మున్సిపల్ అధికారులు సాధారణ దోమల్లా మార్చేస్తున్నారు.
అయితే డెంగీ దోమలను మార్చేందుకు అక్కడి అధికారులు చిన్నారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇండ్లలో వోల్బాచియా ఉన్న దోమలను పెంచి వదిలే బాధ్యతను కొందరు చిన్నారులకు కూడా అప్పగించారు. దీంతో వారు తమ తమ ఇండ్లలోనే వోల్బాచియా ఉన్న దోమలను పెంచి అవి పెద్దవి కాగానే వాటిని బయటకు వదులుతున్నారు. ఇలా కొలంబియాలో డెంగీ దోమల వ్యాప్తిని అరికడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే అనే ప్రాంతంలోనూ ఈ తరహా ప్రయోగాన్ని అక్కడి సైంటిస్టులు చేశారట. దీంతో వారు సక్సెస్ అయ్యారట. అలా వారు డెంగీ ప్రభావాన్ని తగ్గించారట. దీంతో ఇప్పుడు చాలా దేశాలు ఈ విధానాన్ని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
అయితే వోల్బాచియా బాక్టీరియా జీవిత కాలం 50 ఏళ్లట. దీంతో 50 ఏళ్ల తరువాత ఈ బాక్టీరియా ప్రభావం తగ్గిపోతుందని, ఈ క్రమంలో అప్పటికి డెంగీ దోమలు మళ్లీ విజృంభిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయినా.. తాము అప్పటి వరకు మళ్లీ ప్రత్యామ్నాయంగా మరొక విధానాన్ని ఆలోచిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా.. మన దేశంలోనూ ఇలా చేస్తే.. ఎంతో మందిని డెంగీ బారి నుంచి రక్షించవచ్చు కదా..!