చదువుకోవడం జాబ్ చేయడం అందరూ చేసే పనే.. కానీ ఏం చదువుతున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. మీరు చేసే ఉద్యోగం మీకు నచ్చుతుందా.. లేదా ఇవి తెలుసుకోవాలి. ఒక అరవై ఏళ్ల వ్యక్తిని మీ జీవితంలో మీరు చేసిన పెద్ద తప్పు ఏంటి అని అడిగితే.. ఎంజాయ్ చేయాల్సిన టైమ్‌లో ఇష్టం లేని జాబ్ చేస్తూ గడిపేయడమే అంటారట..! లైఫ్ మళ్లీ మళ్లీ రాదు. డబ్బులు సంపాదించడం కోసం మనం పుట్టలేదు కదా..! మన ఇష్టాలకు తగ్గట్టు అడుగులు వేస్తే జీవితం సంపూర్ణంగా ఉంటుంది.
కొంతమందికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కుక్కలు, పిల్లులతో ఆడుకోవడం అంటే వారికి ఎక్కడలేని ఆనందం. వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అలాంటి వాళ్లు అందులో మీ వృత్తిని ఎంచుకుంటే.. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అంటే జంతువులను కాపాలా కాయాలా అంటారేమో..! మనకు ఎలా అయితే సెలూన్స్ ఉన్నాయో.. జంతువులకు కూడా సెలున్స్ ఉంటాయి. మీకు ఎలాగో వీటిపై ఇంట్రస్ట్ ఉందంటే..ఇలాంటి ఫీల్డ్ వైపు చూడండి.
పెట్ గ్రూమింగ్ రంగంలోకి ప్రవేశించడానికి పెద్ద చదువులు అవసరం లేదు. కానీ ఒక కోర్సు చేసి శిక్షణ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. పెట్ గ్రూమింగ్‌లో అనేక సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 2 నుంచి మూడు, 6 నెలల వరకు ఉంటాయి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇది కాకుండా ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేటి కాలంలో అనేక ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.
ఈ రంగంలో ప్రవేశించి విజయం సాధించాలంటే ఆచరణాత్మక పరిజ్ఞానం చాలా ముఖ్యం. పెట్ గ్రూమింగ్ సెలూన్‌లో కొన్ని రోజులు పనిచేసి అనుభవం సంపాదించుకుంటే మీకు ఇంకా ప్లస్ అవుతుంది. జంతువులను ఎలా హ్యాండిల్ చేయాలో వాటికి అందమైన రూపాన్ని ఎలా ఇవ్వాలో తెలుస్తుంది. క్లయింట్ ఏం కోరుకుంటున్నారో తెలిస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు. మీకు ఎంత ఎక్కువ అనుభవం ఉంటే ఈ రంగంలో అంత బాగా సంపాదించవచ్చు.
మీకు పూర్తి నాలెడ్జ్, అనుభవం వచ్చిన తర్వాత సొంత సెలూన్‌ని ఓపెన్ చేయవచ్చు. పెద్ద పెద్ద నగరాల్లో వీటికి డిమాండ్ ఉంటుంది. ఈ రంగంలో సంపాదన అనేది మీరు ఎక్కడ పని చేస్తారు, మీ అనుభవంపైనే ఆధారపడి ఉంటుంది.