ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రవేత్త అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, భౌతిక శాస్త్రవేత్తతో పాటు ఆయనలో ఒక ప్రవక్తను, ఒక కాలజ్ఞుడిని చూసిన ఒకే ఒక వ్యక్తి ఆయన భార్య ఎల్సా. ఆమె తన కజిన్ ఎరిక్‌కి 1934లో రాసిన ఒక ఉత్తరంలో ఐన్‌స్టీన్‌లోని భవిష్యత్ దృష్టి గురించి ప్రస్తావించారు.
ఉత్తరంలో ఏం రాశారంటే..
‘జైలు నుంచి విడుదల అయిన అడాల్ఫ్ హిట్లర్ అనే ఆ వ్యక్తి మారణహోమం సృష్టించి జర్మనీలోని యూదులందరినీ లక్షలాదిగా హతమార్చే అవకాశం ఉంది.’ అని ఐన్‌స్టీన్ తనతో అన్నట్లు ఎల్సా ఓ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్తరం ఇప్పుడు యూఎస్‌లో వేలానికి రావటంతో సర్వత్ర ఆసక్తి కలిగింది.
ఐన్‌స్టీన్‌కు కంటే మూడేళ్లు పెద్ద..
ఐన్‌స్టీన్ మొదటి భార్య మిలేవా 1919 సంవత్సరంలో చనిపోవడంతో పెద్దవాళ్లు ఎల్సాను ఐన్‌స్టీన్‌కు ఇచ్చి చేశారు. అప్పటికి ఐన్‌స్టీన్ వయసు 40 ఏళ్లు. ఎల్సా వయసు 43 ఏళ్లు. భర్త కన్నా భార్య మూడేళ్లు పెద్ద. ఒక అంగరక్షకురాలిగా మాత్రమే ఆమె తన భార్య పాత్రను పోషించారు.
1925 సంవత్సరంలో హిట్లర్ ‘నాజీ’ పార్టీని ప్రారంభించాడు. 1933లో జర్మనీకి అధినేత అయ్యాడు. ఆ సమయంలోనే.. జర్మనీలో యూదులపై హిట్లర్ పాల్పడబోయే దారుణాల గురించి భార్య దగ్గర ఐన్‌స్టీన్ చెప్పేవాడు. యూదులపై జరగబోయే హింసాత్మక అకృత్యాల గురించి పదేళ్ల క్రితమే (1924) ఐన్‌స్టీన్ ఊహించారని 1934లో ఆమె రాసిన ఆ ఉత్తరంలో పేర్కొంది.
ఐన్‌స్టీన్ తన భార్యతో అన్నట్లే 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మొత్తం కోటీ 20 లక్షల మందిని చంపగా.. వారిలో 60 లక్షల మంది యూదులే ఉన్నారు. యుద్ధం ముగిసిన పదేళ్లకు 1955లో ఐన్‌స్టీన్ తన 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆ ఉత్తరం యూస్‌లోని ప్రముఖ సంస్థ నేట్ డీ శాండర్స్‌లో ప్రస్తుతం వేలానికి ఉంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఆ ఉత్తరాన్ని వేలానికి ఉంచారు.