2021లో ముకేష్ అంబానీలో స్ఫూర్తి నింపిన పుస్తకాలు ఇవేనట..!

కరోనా కారణంగా..ప్రతిఒక్కరి జీవితం ఎంతోకొంత ఎఫెక్ట్ అయింది. కొందరు ఉద్యోగాలు కోల్పోతే..మరికొందరు తమ ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో మునిగారు. సామాన్యులే కాదు..ప్రపంచ కుబేరుల్లో కొందరు కూడా ఈ మహమ్మారి వల్ల..ఎఫెక్ట్ అయ్యారు. లయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని పుస్తకాలు తనలో స్ఫూర్తి నింపాయని, 2021ను దాటుకొని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని అందించాయని ముకేశ్‌ అంబానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు..ప్రజలు కూడా వీటిని చదవాలని సిఫార్సు చేశారు. మరి ఆ పుస్తకాలేంటో చూద్దామా..?

‘టెన్‌ లెసెన్స్‌ ఫర్‌ ఏ పోస్ట్‌ పాండమిక్‌ వరల్డ్‌’ – ఫరీద్‌ జకారియా

ప్రస్తుత కొవిడ్‌-19 మహమ్మారిని, గతంలో ప్రపంచాన్ని భయపట్టిన మరికొన్ని వైరస్‌ల వ్యాప్తి, ఎదురైన పరిస్థితుల మధ్య ఉన్న సారూప్యత గురించి వివరిస్తూ ఫరీద్‌ జకారియా ఈ పుస్తకాన్ని రచించారు. నిలకడలేని జీవనశైలి, బలహీనమైన ప్రభుత్వాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాల గురించి ఇందులో వివరించారు. తక్షణమే ఈ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని, సమర్థ నాయకత్వం, జీవనశైలిలో మార్పులు, అంతర్జాతీయంగా పరస్పర సహకారం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలియజేసే విధంగా ఈ పుస్తకం ఉంటుంది.

‘ప్రిన్సిపల్స్‌ ఫర్‌ డీలింగ్‌ విత్‌ ది చేంజింగ్‌ వరల్డ్‌ ఆర్డర్‌: వై నేషన్స్‌ సక్సీడ్‌ అండ్‌ ఫెయిల్‌’ – రే డాలియో

రే డాలియో గత 5 శతాబ్దాల చరిత్రలో ప్రపంచంలోని గొప్ప దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక విజయాలు, పరాజయాలపై విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకం రాశారు . ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కఠిన సమయం కంటే రాబోయే కాలం భిన్నంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడంలో ఈ పుస్తకంలో వివరించారు. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువతరం ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదివి తీరాలని ముకేశ్‌ అంబానీ సూచించారు.

‘ది ర్యాగింగ్‌ 2020ఎస్‌: కంపెనీస్‌, కంట్రీస్‌, పీపుల్‌ – అండ్‌ ది ఫైట్‌ ఫర్‌ అవర్‌ ఫ్యూచర్‌’ – అలెక్‌ రాస్‌

రచయిత అలెక్‌ రాస్ కార్పొరేట్‌ కార్యకలాపాలు, ప్రభుత్వ వైఫల్యం, ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాలకు సంబంధించిన కథనాలను ఇందులో పొందుపరిచారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల ఆలోచనాపరుల ఇంటర్వ్యూలనూ ఈ పుస్తకంలో మనం చదవొచ్చు.

‘బిగ్‌ లిటిల్‌ బ్రేక్‌థ్రూస్‌: హౌ స్మాల్‌, ఎవ్రీడే ఇన్నోవేషన్స్‌ డ్రైవ్‌ ఓవరైజ్డ్‌ రిజల్ట్స్‌’ – జోస్‌ లింకర్‌

జోస్‌ లింకర్‌ రచించిన ఈ పుస్తకం.. కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్ని సంస్థలు, వ్యక్తులు వినూత్న ఆవిష్కరణలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక అవకాశం కోసం సుదీర్ఘ కాలం కష్టపడకుండా వినూత్న ఆలోచనలతో అనతికాలంలోనే గొప్ప గొప్ప అవకాశాల్ని ఎలా సృష్టించుకుంటారు అనేది ఈ పుస్తకం వివరిస్తుంది.

‘2030: హౌ టుడేస్‌ బిగ్గెస్ట్‌ ట్రెండ్స్‌ విల్‌ కొల్లైడ్‌ అండ్‌ రీషేప్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ – మౌరో గిల్లెన్‌

2030లో ప్రపంచం ఎలా ఉంటుంది? నగరీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అంశాలను కళ్లకు కట్టేవిధంగా రచించారు మౌరో గిల్లెన్‌. ఆయన అంచనాల ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల వినియోగదారులపై ఆధారపడకుండానే వృద్ధి సాధిస్తుంది. పురుషుల కన్నా మహిళల వద్దే సంపద ఎక్కువ ఉంటుందట. కార్మికుల స్థానంలో పెద్ద ఎత్తున రోబోలు వచ్చేస్తాయి. కార్మికుల సంఖ్య కంటే రోబోలు, దేశాల కంటే కరెన్సీలే ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, భవిష్యత్‌లో జరగబోయే విషయాలు, విపత్తులు వాటి పరిణామాలపై ఈ పుస్తకంలో అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. ఏం జరగబోతుంది అనే తెలుసుకోవాలనే ఆత్రత ఉన్నవారికి ఈ బుక్ బాగా ఉపగయోగపడుతుంది.
మీకు కూడా బుక్స్ చదివే అలవాటు ఉంటే..వీటిని కూడా ఓ సారి ట్రే చేసేయండి మరీ..!