తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ముందస్తు ఎన్నికల గురించి చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మరొకసారి అధికారంలోకి రావడంతో..ఈ సారి కూడా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ముందస్తుకు వెళ్ళమని చెబుతున్నారు…కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు.
సరే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు గురించి చర్చ ఉండి గానీ, ఏపీ లో మాత్రం ఎప్పుడు ముందస్తుపై చర్చ జరగలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం…దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని పలు సందర్భాల్లో మాట్లాడారు. కానీ వైసీపీ, ప్రభుత్వాన్ని ముందే రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ఎప్పుడు చెప్పలేదు. అటు వైసీపీలో కూడా ఈ చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా చంద్రబాబు…ముందస్తు ఎన్నికల గురించి తాను విన్నానని, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమే అని ప్రకటించారు.
అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదని, ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి అవకాశం ఉందని, ఐదేళ్ల పాటు కంటిన్యూ అవుతామని చెబుతున్నారు. కాకపోతే నిప్పు లేకుండా పొగ రాదని అంటారు…అంటే ముందస్తు గురించి బ్యాగ్రౌండ్లో చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా ముందస్తుకు వెళ్లడానికి వైసీపీ సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది.
ఎందుకంటే వైసీపీపై ఇప్పుడుప్పుడే వ్యతిరేకత పెరుగుతుంది..ఇదే ఐదేళ్లు అయ్యేసరికి మరింత ఎక్కువ అవ్వొచ్చు. అయితే ఈలోపే ఎన్నికలకు వెళితే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారట. ఒక ఏడాది ముందే ఎన్నికలకు వెళితే..అనుకున్న స్థాయిలో వ్యతిరేకత ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక వైసీపీ వ్యూహాలకు తగ్గట్టుగానే చంద్రబాబు సైతం…ముందస్తుకు టీడీపీ శ్రేణులని రెడీ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఫేస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ముందస్తుపై ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.