కోటి రూపాయిల పెట్టి రోడ్డు నిర్మిస్తే.. కొబ్బరికాయ కొట్టడంతోనే బీటలు వారిందట..!

-

రోడ్లు, ప్రాజెక్టుల కోసం ఏ ప్రభుత్వం అయినా కోట్లల్లో ఖర్చుపెడుతుంది. కానీ.. దాని ఫలితం మాత్రం ఖర్చుపెట్టినంత స్థాయిలో ఉండదనేది అక్షరసత్యం. రోడ్లు వేసిన రెండు మూడేళ్లకే మళ్లీ మరమ్మత్తులకు గురవతుంటాయి. సర్లే ఇదన్నా బెటర్.. కానీ అక్కడ మాత్రం కోటి రూపాయలు పెట్టి రోడ్లు నిర్మిస్తే.. శంకుస్థాపన చేద్దాం అని కొబ్బరికాయ కొడితే.. కాయ పగలలేదు సరికదా.. రోడ్డు బీటలు వారిందట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ప్రభుత్వం 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 7 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించింది. రహదారి ప్రారంభోత్సవానికి బిజ్నోర్‌, సదార్‌ నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరీని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజ చేసి.. కొబ్బరి కాయ కొట్టి.. రోడ్డును ప్రారంభిద్దామని అనుకున్నారు. అయితే కొత్తగా నిర్మించిన రోడ్డుపై కొబ్బరికాయ కొడితే..అది పగలలేదు కానీ.. రోడ్డు మాత్రం బీటలు వారింది. దాంతో అక్కడి వారంతా విస్తుపోయారు.

ఈ సంఘటనపై మౌసం చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చి.. నమూనాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. మూడు గంటలు నిరీక్షించిన తర్వాత మొత్తానికి అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆమె తారు నమూనాను సేకరించడంలో అధికారులకు సహాయం చేయడానికి గాను ఆ ప్రదేశంలో తవ్విన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మన దగ్గర రోడ్లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉంటుందో తెలుసు.. ఏ నిర్మాణాల నాణ్యత అయినా సదరు కాంట్రాక్టర్‌ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టు డబ్బులు దోచేసి.. నాసిరకం పనిముట్లతో రోడ్లు, బిల్డింగ్స్, బ్రిడ్జ్ లు కట్టేసి అమాయకపు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిజమైన ఇంజినీర్.. నిజాయతీ పరుడైనా కాంట్రాక్టర్ ఉన్నప్పుడే పనులు నాణ్యతగా జరుగుతాయి. ఈ ఘటన మనకు హాస్యం కలిగించవచ్చు.. కానీ అక్కడ రోడ్డు కాకుండా ఏ ఫ్లైవోర్ ఉంటే పరిస్థితి ఏంటీ? ఇలాంటి ఘటనలు మనకేం కొత్తకాదు.. ఇప్పటికే ఎన్నో వార్తలు చూశాం.. సినిమాల్లోనూ ఇలాంటి వాటి గురించి చూపిస్తుంటారు. అయినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవటం లేదు అనే భావన ప్రజల్లో బలంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news