దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు ఆఖరికి పేడను కూడా వదలటం లేదు దొంగలు. చీప్‌గా పేడ దొంగతనం చేయటం ఎంటా అనుకుంటున్నారా.. సాధారణంగా మనం పేడను ఖాళీ స్థలంలో వేసేస్తాం.. అసలు వాటి గురించి పట్టించుకోం కూడా.. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం పేడను బంగారంలా కాపాడుకుంటున్నారు. పేడ దొంగలెత్తుకెళ్లకుండా సీసీ కెమెరాలు, కాపలాదారుల్ని పెట్టుకుంటున్నారట. ఆఫ్‌ట్రాల్ పేడకు ఎందుకు ఇంత డిమాండ్ అనేగా మీకు డౌట్.. అది తెలియాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే..!
పేడ అమ్మితే డబ్బులు ఇస్తున్నారు.. అందుకే దొంగతనం చేసి మరీ పేడ అమ్ముతున్నారట. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అంతే పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. తాజాగా.. అంబికాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి ముందు సీసీ కెమెరాల ఏర్పాటు..
దొంగతనాలు పెరగటంతో.. పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు కూడా రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ కాపలాదారులను కూడా నియమించుకోవాలని నిర్ణయించుకున్నారు. పేడ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఎన్ని వింతు విచిత్రాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి.
ఇలాంటి పథకం మన దగ్గక కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందో.. మనోళ్లు కూడా ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టుకుని పేడను కాపాడుకుంటారేమో.. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నా.. మరో పక్క అక్కడి అధికారులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పేడను కాపాడుకోలేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారూ నిందితులను పట్టుకోవడంలో బిజీ అవుతున్నారు.