ఇంట్లో అక్వేరియం ఉందా.. అయితే వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

ఈ రోజుల్లో ఇంట్లో అక్వేరియం ఉండటం చాలా కామన్ అయిపోయింది. ఇంటికి అందాన్ని తెచ్చిపెడుతుందని కొందరు, పిల్లలకు ఇష్టమని మరికొందరు అక్వేరియంలో చేపలు పెంచుతున్నారు. అయితే మనం ప్రేమగా పెంచే చేపలకు ఈ సమ్మర్ లో ఏదైనా అయితే బాధేస్తుంది కదా..మరి అలా జరగకుండా.. ఎండల ప్రభావం చేపలమీద పండకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా..!

నీటి ఉష్ణోగ్రత 22- 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటేనే చేపలకు అనుకూలం. అంతకన్నా ఎక్కువ ఉంటే వాటికి ఆక్సిజన్‌ స్థాయులు సరిపోవు. పదే పదే నీటి బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటుండటం చేస్తుంటాయి. ఈ ఇబ్బంది పెరిగితే అవి చనిపోతాయి. మధ్యాహ్న సమయాల్లో పై మూతను తీసి ఉంచండి. నీరు కాస్త చల్లబడటంతోపాటు ఎక్కువ ఆక్సిజన్‌ అందే వీలుంటుంది.

చేపలు కదిలే తీరు బాగా కనిపించాలని లైట్లు పెడుతుంటారు..అయితే పగలు వాటిని తీసేయడం మంచిది. కొన్ని గంటలకోసారి చల్లటి నీరు కలుపుతుండాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాక కొద్ది కొద్దిగా కలపాలి. టేబుల్‌ ఫ్యాన్‌ను ఫిష్‌ ట్యాంకు ముందు ఉంచినా మంచిదే.

సూర్య కిరణాలు నేరుగా పడని ప్రదేశంలో దీన్ని ఉంచాలి. చేపలు పెరిగేకొద్దీ వాటికి ఎక్కువ ఆహారాన్ని అందించాలని కొందరూ బాగా వేస్తుంటారు. కానీ అది అతి అయినా ప్రమాదమే. మిగిలిపోయిన వాటి ఆహారం, విసర్జితాలు త్వరగా విషతుల్యమవుతాయి. కాబట్టి రోజుకు 2, 3 సార్లు కొద్ది మొత్తంలో ఆహారం ఇవ్వండి. తరచూ నీటిని మారుస్తూ ఉండండి.

ట్యాంకులో పవర్‌ ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇవి నీరు కదిలేలా చేస్తాయి కాబట్టి, ఆక్సిజన్‌ స్థాయులు పెరుగుతాయి.

అలాగే అక్వేరియంను మనకు నచ్చిన ప్లేసుల్లో పెట్టకూడదు. ఇంట్లో అక్వేరియంలో చేపలను పెంచడం అనేది.. వాస్తుతో పని. కాబట్టి వాస్తుప్రకారం మాత్రమే ఇంట్లో అక్వేరియం ఉంచుకోవాలి. వాస్తుప్రకారం.. వంటగదిలో లేదా పడకగదిలో లేదా ఇంటి మధ్యలో చేపల అక్వేరియం ఉంచకూడదు. చేపల అక్వేరియంను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టాలట. తద్వారా సహజ కాంతి అక్వేరియంపై ప్రసరిస్తుంది. దీంతో కెరీర్‌లో మంచి ఎదుగుదల, ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news