ఏడాదికి రూ. 58 లక్షల వేతనంతో ఉద్యోగం.. చేరేలోపే గుండెపోటుతో మరణం..

జీవితం చాలా చిన్నది…ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎంతో కష్టపడి చదువుకుని పెద్ద జాబ్‌ తెచ్చుకుని ఆ ఆనందం నాలుగు రోజులు కూడా లేకుండానే..గుండెపోటుతో చనిపోయాడు..పాపం 22ఏళ్ల వయసు అసలు ఏం ఎంజాయ్‌ చేశాడు.. జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే..అందర్ని వదిలేసి పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసి 22 ఏళ్లకే రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఆ యువకుడు ఉద్యోగం పొందాడు. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అతడి పేరు కట్టా అభిజిత్‌రెడ్డి (22). రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ కె.చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు. వరంగల్‌ నిట్‌లో చదివిన అభిజిత్‌.. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ‘సౌదీ అరామ్‌కో”లో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు.

ఏడాదికి 70 వేల అమెరికన్‌ డాలర్ల అంటే సుమారు రూ.58 లక్షలు వేతనం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లి రాత్రి టీవీలో భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ చూశాడు. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో మెలకువ వచ్చింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే కుప్పకూలిపోయాడు. అలికిడికి లేచిన తమ్ముడు.. ఆందోళనతో తల్లిదండ్రులనూ లేపాడు. మొదట రెండు చేతులతో అభిజిత్‌ గుండెపై గట్టిగా నొక్కడం (కార్డియో పల్మనరీ రెససిటేషన్‌-సీపీఆర్‌) చేశారు.. తర్వాత ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అతడు తెల్లవారుజామున మృతిచెందాడు.

చెట్టంత కుమారుడు కళ్లముందే కుప్పకూలిపోవడంతో చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి గుండెలవిసేలా విలపించారు.. వీరి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల. అభిజిత్‌ అకాల మరణంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ వైద్యమంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.