జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి షాక్‌.. మ‌హిళ‌కు రూ.890 కోట్ల న‌ష్ట ప‌రిహారం చెల్లింపు..

ప్ర‌ముఖ బేబీ ప్రొడ‌క్ట్స్ త‌యారీదారు జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌పై గ‌తంలో ఓ మ‌హిళ న‌ష్ట‌ప‌రిహారం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్‌కు చెందిన 67 ఏళ్ల డొన్నా ఒల్సాన్ త‌న భ‌ర్త రాబ‌ర్ట్ ఒల్సాన్‌తో క‌లిసి న్యూయార్క్ స్టేట్ కోర్టులో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పై దావా వేశారు. ఆ కంపెనీకి చెందిన బేబీ టాల్కాం పౌడ‌ర్‌ను 50 ఏళ్లుగా వాడ‌డం వ‌ల్ల త‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని అందుక‌ని న‌ష్ట‌పరిహారం చెల్లించాల‌ని వారు కోర్టులో కేసు వేశారు.

johnson and johnson agreed to pay rs 890 crore compensation

అయితే బాధితుల కేసును విచారించిన కోర్టు అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ఆ విష‌యం నిజ‌మే అని తెలుసుకుంది. దీంతో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ ఏకంగా 325 మిలియ‌న్ డాల‌ర్ల‌ను స‌ద‌రు జంట‌కు ఫైన్‌గా చెల్లించాల‌ని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే న‌ష్ట‌ప‌రిహారం మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని అంత చెల్లించ‌లేమ‌ని, 120 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపుగా రూ.890 కోట్లు) అయితే ఓకేన‌ని జాన్స‌న్ అండ్ జాన్స‌న్ తెల‌ప‌డంతో అందుకు బాధితులు స‌రేన‌ని అంగీక‌రించారు. దీంతో ఆ కంపెనీ వారికి తాజాగా అంత మొత్తాన్ని చెల్లించేందుకు కోర్టులో అంగీకారం తెలిపింది.

కాగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి చెందిన బేబీ టాల్కం పౌడ‌ర్‌లో ఆస్బెస్టాస్ క‌లుస్తుంద‌ని, అందువ‌ల్లే చాలా మందికి క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని స‌ద‌రు కోర్టు జ‌డ్జి కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే జాన్స‌న్ అండ్ జాన్స‌న్ మాత్రం తాము సుర‌క్షిత‌మైన టాల్కం పౌడ‌ర్‌ను త‌యారు చేస్తామ‌ని, దాని వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని, వినియోగ‌దారుల ఆరోగ్యం ప‌ట్ల త‌మ‌కు బాధ్య‌త ఉంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఈ వార్త మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చి చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.