పబ్‌జి మొబైల్ గేమ్‌కు ఇప్పుడు పిల్లలు, యువత ఎలా బానిసలు అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు రోజు మొత్తం పబ్‌జి మొబైల్ గేమ్‌లోనే మునిగి తేలుతున్నారు. దీంతో విద్యార్థులు చదువులను నాశనం చేసుకుంటున్నారు. ఇక పబ్‌జి మొబైల్ గేమ్‌కు సంబంధించి మనకు తరచూ ఒక సంఘటన తెలుస్తోంది. ఇప్పుడు కూడా పబ్‌జి మొబైల్‌కు చెందిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పబ్‌జి మొబైల్ ఆటకు అంతరాయం కలిగించారనే నెపంతో ఓ యువకుడు ఏకంగా తనకు కాబోయే బావనే కత్తిపోటు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…
ముంబైలోని కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే రజనీష్ రాజ్ భర్ (27) పబ్‌జి ఆడుతుండగా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. దీంతో చార్జర్ కోసం వెతకగా అతనికి ఆ ఫోన్ చార్జర్ కేబుల్ తెగిపోయి కనిపించింది. దీంతో అది తన సోదరి పనే భావించిన అతను ఆమె ల్యాప్‌టాప్ చార్జర్ వైర్‌ను కోసేశాడు. ఆ తరువాత ఆమెకు కాబోయే భర్త (రాజ్ భర్ బావ) ఓమ్ బావ్‌దాంకర్ (32) అడ్డు రావడంతో రజనీష్ ఆగ్రహం పట్టలేక అతన్ని కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు ఓమ్ బావ్‌దాంకర్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఓమ్ బావ్‌దాంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటన ఈ నెల 7వ తేదీన జరగ్గా దీని గురించిన వివరాలు ఆలస్యంగా తెలిశాయి.
ఈ మధ్య కాలంలో పబ్‌జి మొబైల్ గేమ్ కు సంబంధించి అన్నీ వివాదాస్పద సంఘటనలే జరుగుతున్నాయి. గతంలో ముంబైకి చెందిన 11 ఏళ్ల బాలుడు పబ్‌జి మొబైల్ గేమ్ ను బ్యాన్ చేయాలని, దాంతో తన మానసిక పరిస్థితి అదుపు తప్పుతుందని కోరుతూ ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాశాడు. ఇక ఇటీవలే ఓ యువకుడు పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుకునేందుకు ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలు మాత్రమే. పబ్‌జి మొబైల్ వల్ల ఎంత మంది ఇలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ.. ఈ గేమ్‌ను మాత్రం బ్యాన్ చేయాల్సిందేనని పలువురు కోరుతున్నారు.