బిట్‌ కాయిన్‌తో రాత్రికి రాత్రి కోటీశ్వరులవ్వచ్చా…?

-

వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌ దుమ్మురేపుతోంది. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కరెన్సీ అదనంత ఎత్తుకు దూసుకుపోతోంది. నియంత్రణ లేని బిట్‌కాయిన్‌ మార్కెట్లను షేక్‌ చేస్తోంది. దీంతో చాలా మంది బిట్‌కాయిన్స్‌తో కరెన్సీ ట్రేడింగ్‌ చేసేందుకు ఆసక్తి చూస్తున్నారు.అతిత్వరగా ఎక్కువ డబ్బు సంపాదించేందుకు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు.

బిట్ కాయిన్ విలువ పెరగడం అనేది పూర్తిగా డిమాండ్ సరఫరా అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. దీనిని క్రియేట్ చేసినపుడు కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్లు మాత్రమే ఉండేలా ప్రోగ్రాం చేసారు. 2020 డిసెంబర్ నాటికి కోటి 85 లక్షల బిట్ కాయిన్లు మైన్ చేశారు. అంటే ఇంకో 25 లక్షల బిట్ కాయిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట. కానీ దీనిని కొనేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోవడంతో… డిమాండ్‌ పీక్‌స్టేజ్‌కు చేరుతోంది. దీంతో ఆటోమెటిక్‌గా విలువ వేగంగా పెరుగుతోంది.

బిట్‌కాయిన్లు కొనాలంటే ఆన్‌లైన్‌ ఎక్స్ఛేంజీలను ఆశ్రయించాల్సిందే. బయ్యూకాయిన్, కాయిన్ షేర్, యూనోకాయిన్ వంటి ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. దీని కోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతా..మనం కొనే బిట్‌కాయిన్లను దాచుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక… సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్‌కాయిన్లు వచ్చి చేరతాయి. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సుమారు పది రోజులు పైగా పడుతోంది.

బిట్‌కాయిన్‌ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు. నేరుగా మన వాలెట్‌లో నుంచి డబ్బు వ్యాపారి వాలెట్‌లోకి వెళ్తుంది. బిట్‌కాయిన్ లావాదేవీలు ఎవరు నిర్వహించారు అనే విషయం తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. వీటికితోడు వేరొకచోటికి తీసుకెళ్లటం, దాచుకోవటం వంటి అంశాల్లో కష్టం ఉండదు. వీటన్నిటితో పాటు… బిట్కాయిన్ లావాదేవీలపై ఛార్జీలుండవు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యం… బిట్‌కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. అంటే అంతా పారదర్శకం అన్న మాట.

అయితే ఇందులోనూ రిస్క్‌ లేదని చెప్పలేమని అంటున్నారు నిపుణులు. బిట్‌కాయిన్ లావాదేవీల సమాచారం మొత్తం కంప్యూటర్ సర్వర్లలో ఉన్నప్పటికీ అది భద్రంగా ఉంటుందని చెప్పలేం. హ్యాకర్లు దాడిచేస్తే బిట్ కాయిన్ లావాదేవీలు ప్రశార్థకమే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వర్చువల్ కరెన్సీ కనుక సాఫ్టవేర్‌ పరంగా ఏదైనా సమస్య వస్తే అప్పుడు కూడా బిట్‌కాయిన్ వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news