కూతురి కోసం చిరుతతో పోరాడిన అమ్మ ..!

క‌న్న బిడ్డపై త‌ల్లికి ఉన్నంత ప్రేమ ఎవ‌రికీ ఉండ‌ద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌న్న బిడ్డ‌పై త‌ల్లికి అనంత‌మైన ప్రేమ ఉంటుంది. అటువంటి ఓ బిడ్డను ఒక చిరుత పులి త‌న ముందే ఈడ్చుకుపోతుంటే ఆ తల్లి ఉండ‌లేక‌పోయింది. అప్పుడు ఆ త‌ల్లి అమ్మ‌వారిలా మారిపోయింది. చిరుతపై పోరాడి తన బిడ్డను రక్షించుకున్న ఆ త‌ల్లి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివరాల్లోకి వెళ్తే .. చంద్రాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునోనా గ్రామానికి చెందిన అర్చన ఈ నెల 3న మ‌ల‌విస‌ర్జ‌న‌కు బ‌య‌ట ఉన్న డ‌విలోకి వెళ్లింది.

అర్చనతో పాటు ఐదు ఏండ్ల ఆమె బిడ్డ ప్రజాక్త కూడా ఆమెతో పాటు వెళ్లింది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత వారిద్దరు విడిపోయారు. బిడ్డ అరుపులు వినపడ‌గానే వెంట‌నే బిడ్డ ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గానే ఆమె ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. కూతురి తల ప‌ట్టుకొని చిరుత‌పులి లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. మొద‌ట‌గా ఆ త‌ల్లి బ‌య‌ప‌డింది. కానీ తన బిడ్డ ప్రాణాపాయంలో ఏమీ ఆలోచించ‌కుండా చిరుతపులి వెంట పడింది. పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని ఆ చిరుత పోరాటం చేసింది. నోట్లో ఉన్న బాలికను వ‌దిలేవ‌ర‌కూ చిరుతను కొడుతూనే ఉంది.

ఆమె దాడికి బెదిరిన చిరుత పులి ఆమెపైకి రావటానికి ప్రయత్నించింది. ఆమె భయపడకుండా ఇంకా కొడుతూనే ఉంది. దాంతో చిరుత ప‌రారైంది. అయితే చిన్నారికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన కూతుర్ని ఎత్తుకుని ఇంటికి పరిగెత్తుతుండగా ఫారెస్ట్ అధికారులు ఎదురై చంద్రాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారికి కింద దవడ ఎముకలు విరిగి పక్కకు జరిగాయి. తొంద‌ర్లోనే పూర్తి స్థాయి శస్త్ర చికిత్స చేయనున్నారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును అటవీశాఖ తరఫున అంద‌జేస్తున్నారు.