సినీ, క్రీడా ప్రముఖులనే కాదు.. పేరు గాంచిన రాజకీయ నాయకులను బాగా అభిమానించే వారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుల కోసం కొందరు అభిమానులు ఏం చేసేందుకైనా వెనుకాడరు. తమ అభిమానాన్ని చాటుకునే యత్నం చేస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.. ఇప్పుడు మేం చెప్పబోయే ఓ యువకుడు. అతను త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే తన పెళ్లికి బహుమతులు ఏమీ వద్దని, అందుకు బదులుగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని అతను తన శుభలేఖలో అతిథులను కోరుతున్నాడు.
అతని పేరు ముకేష్ రావు యాండె. ఉంటున్నది హైదరాబాద్‌లో. వయస్సు 27 సంవత్సరాలు. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతను ఈ నెల 21వ తేదీన పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే ఇతను తన పెళ్లి శుభలేఖపై వినూత్న రీతిలో వాక్యాలు రాయించాడు. అవేమిటంటే… రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని, అదే తన పెళ్లికి అతిథులు ఇచ్చే పెద్ద బహుమతి అని, తనకు ఇతర బహుమతులు ఏవీ అక్కర్లేదని.. ముకేష్ రాయించాడు. దీంతో ఇప్పుడతని శుభలేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ముకేష్ శుభలేఖపై అలా మోడీకి ఓటు వేయమని రాయించేందుకు ముందు తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పాడట. కానీ వారు అందుకు ఒప్పుకోలేదట. పెళ్లికి వచ్చే అతిథులు కేవలం మోడీ అభిమానులు మాత్రమే రారని, అన్ని పార్టీలను అభిమానించే వారు ఉంటారని, అలాంటప్పుడు కొందరికి ఇలా రాయించడం నచ్చదని అన్నారట. అయినా ముకేష్ వినిపించుకోకుండా అలా శుభలేఖలపై రాయించేశాడు. ఈ క్రమంలోనే పలువురు ముకేష్‌ను అభినందిస్తుండగా, కొందరు మాత్రం అలా చేసి ఉండాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడీ శుభలేఖ మాత్రంలో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
కాగా, ముఖేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆరెస్ పార్టీకి వీరాభిమాని. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్‌కు ఓటేయడమే కాక, ప్రచారం కూడా నిర్వహించాడు.అయితే ప్రధానమంత్రిగా మాత్రం తన మద్దతు మోడీకేనని చెప్పడం విశేషం.
అయితే ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సార్లు ఇలా కొందరు తమ శుభలేఖలపై రాయించి మోడీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ముకేష్‌ను సమాధానం అడగ్గా, అందుకు అతను స్పందిస్తూ… మోడీ ప్రజల మనిషని, ఆయన అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి దేశాన్ని సరైన దారిలో ముందుకు తీసుకుపోతున్నారని, కనుక ఆయనకే ఓటు వేసి మళ్లీ ఆయన్ను ప్రధానిని చేయాలని.. అంటున్నాడు.