ఇంటర్నెట్‌లో మనం ఏదైనా సమాచారాన్ని వెదకాలంటే.. మనకు ఇష్టం వచ్చిన భాషలో ఆ సమాచారం వెదకవచ్చు. కానీ వెబ్‌సైట్ అడ్రస్‌ల విషయానికి వస్తే వాటిని కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే టైప్ చేయాలి. అది తప్పదు. అయితే ఇకపై ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే.. ఇకపై త్వరలో పలు భారతీయ భాషల్లోనూ వెబ్‌సైట్ అడ్రస్‌లను పెట్టుకునే వీలును కల్పించనున్నారు. ఇందుకు గాను అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు Internet Corporation for Assigned Names and Numbers (ICANN) వెల్లడించింది. అంటే మీరు ఇప్పుడు manalokam.comను మనలోకం.com టైప్ చేసి కూడా చదవచ్చు
త్వరలో తెలుగు, తమిళం, ఒరియా, మళయాళం, కన్నడ, గుర్ముఖి, గుజరాతీ, దేవనాగరి, బెంగాలీ భాషల్లో వెబ్‌సైట్ అడ్రస్‌లను పెట్టుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 52 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వాడుకోగలుగుతున్నారు. మిగిలిన 48 శాతం మందికి ఇంగ్లిష్ రాదు. అందువల్ల వారు ఇంటర్నెట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందువల్ల ఇంటర్నెట్ పరిధిని మరింత విస్తృతం చేయడం కోసమే ప్రజలకు తమ తమ మాతృభాషల్లో ఆ సేవలను అందించాలని ఐక్యాన్ నిర్ణయం తీసుకుంది. అందుకనే ఇకపై ఆ భారతీయ భాషల్లోనూ వెబ్‌సైట్ అడ్రస్‌లు (డొమెయిన్ నేమ్స్) పెట్టుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు.
మొత్తం 22 భారతీయ భాషల్లో డొమెయిన్ నేమ్స్‌ను పెట్టుకునే వెసులు బాటును అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు గాను భారత్‌కు చెందిన 60 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని ఐక్యాన్ ఇండియా హెడ్ సమీరన్ గుప్తా తెలిపారు. వీరు దేవనాగరి, గుజరాతీ, గుర్ముఖి, కన్నడ, ఒరియా, తెలుగు భాషలకు గాను ఇప్పటికే 6 స్క్రిప్ట్‌లను సిద్ధం చేశారని అన్నారు. వీటికి ఆమోదం లభించాక ఇక డొమెయిన్ నేమ్స్‌ను ఆయా భాషల్లోనూ పెట్టుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 4.2 బిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా ఆ సంఖ్య 2022 వరకు 5 బిలియన్లకు చేరుకుంటుందని, ఈ క్రమంలో తాము ప్రవేశపెట్టనున్న సౌకర్యం వల్ల భారత్ లో మరింత మందికి ఇంటర్నెట్ చేరువవుతుందని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.