యూట్యూబ్‌లో వీడియోలు చూసి కోడి కోసం ఆంధ్రా వచ్చిన థాయ్‌లాండ్‌ వాసులు

-

జనాలు ఈ మధ్య సోషల్‌ మీడియాను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఫ్రెండ్‌ కోసం ఖండాలు దాటి మరీ వచ్చి పెళ్లి చేసుకున్న ఘటన ఈ మధ్యనే తెగ ట్రెండ్‌ అయింది. ఇంకో పక్క ఫేస్‌బుక్‌లో ఎవడో ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడని నమ్మి ఆరు లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటనలూ ఉన్నాయి. యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చాలా నాలెడ్జ్‌ పెంచే వీడియోలు కూడా ఉంటాయి. కొంతమంది అయితే కేవలం యూట్యూబ్‌ వీడియోలు చేసి పరీక్షలు రాసి పట్టాలు కూడా పొందారు. ఇక్కడ ఓ థాయ్‌లాండ్‌ వాసి యూట్యూబ్‌ వీడియోలు చూసి ఆంధ్రా వచ్చి పందెం కోడిని కొన్నాడట. కోడి కోసం అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడు..?

ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే సంక్రాంతి సంబురాల వీడియోలు చూడడం అంటే చాలా మందికి ఇష్టం. నెట్టింట ఏపీ సంక్రాంతి సంబురాలకు సంబంధించిన అనేక వీడియోలు ఉంటాయి. అయితే ఇలా వీడియోలు చూసిన కొంత మంది థాయ్ లాండ్ వాసులు తాజాగా ఏపీలోని ఏలూరుకు వచ్చారు. ముఖ్యంగా కోడి పందాలాకు సంబంధించిన వీడియోలను చూసి వాటిని కొనుగోలు చేయాలనుకున్నారు. అక్కడి ప్రజలను అడిగి మరి ఓ పందెం కోడి పిల్లలను.. అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కోడి పిల్లను వెంట తీసుకెళ్లారు.

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రాలోని పశ్చిమ గోదావరిలోని గణపవరంలో జరిగిన కోడి పందాల్లో ఓ పందెం కోడి రూ.27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. థాయ్ రూస్టర్ ప్రేమికులు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో కోడి పందాలను చూసి దానిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. ఆ కోడి యజమాని రత్తయ్యను ఆ కోడిని అమ్మాలని కోరారు. కోడి కోసం వారు 3 రోజుల పాటు అతనిని వేడుకున్నా, రత్తయ్య దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. చివరకు తమ దేశంలో జాతిని అభివృద్ధి చేసేందుకు మరో కోడిని ఎంపిక చేసి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు.

27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న కోడి కోసం థాయ్ గ్రూప్ తనను ఎంతగానో బతిమాలినట్లు రత్తయ్య తెలిపారు. కానీ తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ఆ కోడిని ప్రాణం పోయినా అమ్మనని రత్తయ వారికి చెప్పారు. అలాగే వియత్నాం, మెక్సికో, కెనడా, యూఎస్‌ఏ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు చెందిన వారు కోళ్ల కొనుగోలు కోసం ఫేస్‌బుక్‌ ద్వారా తరచూ సంప్రదిస్తున్నారని రత్తయ్య చెప్పారు. ఇటీవల వియత్నాంకు చెందిన ఓ సమూహం తన వద్ద నుంచి మొత్తం 40 పందెం కోళ్లను కొనుగోలు చేసింది. 40 ఎకరాల భూమిలో దాదాపు 500 పందెం కోళ్లను రత్తయ్య పెంచుతున్నారు.

ఇదేదో బాగుంది కదా.. ఎందుకు ఈ జాబ్‌లు చేయడం.. ఊరెళ్లి మనం కూడా ఏదో ఒక కోళ్ల ఫారమో, లేక నాలుగు గాడిదలను పెంచుకున్నా.. నెలకు లక్ష రూపాయలు ఈజీగా వచ్చేస్తాయ్‌ కదా..! అని చాలా మంది అనుకుంటున్నారట..!

Read more RELATED
Recommended to you

Latest news