1988లో జరిగిన మోసం.. నేడు నేరస్థుడికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

-

యావజ్జీవ శిక్ష కూడా 14 ఏళ్ల తర్వాత తగ్గించే వీలు ఉంటుంది. కానీ ఓ వ్యక్తికి కోయంబత్తూరు కోర్టు ఒక నేరస్తుడికి అత్యంత కఠినమైన శిక్షవిధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 35ఏళ్ల క్రితం నమోదైన కేసులో నిందితుడికి 383ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటో తెలుసా.

తమిళనాడులోని కోయంబత్తూరు కోర్టు ఒక నేరస్తుడికి అత్యంత కఠినమైన శిక్షవిధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మోసం, సంతకాల పోర్జరీ కేసులో పట్టుబడిన వ్యక్తికి 383ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు జైలుశిక్ష. దీంతో పాటు 3.32 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాలకు పాల్పడిన ముఠాలో కోదండపాణి అనే ఉద్యోగి కీలకసూత్రధారిగా ఉన్నాడు. అతనికే కోర్టు ఈ శిక్ష విధించింది. ఆర్టీసీ బస్సుల వేలంలో ఫేక్ డాక్యుమెంట్స్‌ క్రియేట్ చేసి 47 ఆర్టీసీ బస్సుల విక్రయానికి పాల్పడ్డాడు. 35 ఏళ్ల క్రితం జరిగిన ఈ అక్రమాల కేసులో విచారణ ఇన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. చివరకు ఈవిధంగా తీర్పిచ్చింది.

ఆర్టీసీ బస్సులను అక్రమంగా విక్రయించిన కేసులో గత 35 ఏళ్లుగా విచారణ జరుగుతోంది. కోయంబత్తూరు ఆర్టీసీ డివిజన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు వాహనాల వేలంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఒకటి రెండు కాదు 47 బస్సులను ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకున్నారు. బస్సుల వేలం ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లుగా 1988 నవంబర్ 9న పోలీస్ కేసు బుక్కైంది. ఈ కేసులో 8మంది ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించి 47 బస్సుల్ని అమ్ముకొని 28లక్షల రూపాయల మోసం చేశారు.

ఈ అక్రమాలకు పాల్పడింది 8మంది ఉద్యోగులేనంటూ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురునాథన్, దురైస్వామి, రంగనాథన్‌, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసు గత 35 ఏళ్ల నుంచి కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణలో ఉండగానే నలుగురు నిందితులు మృతి చెందారు.

ఈ చీటింగ్ కేసులో మిగిలిన నలుగురిలో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించి వదిలివేసింది. మిగిలిన ఒక్క ఉద్యోగి కోదండపాణిని నిందితుడిగా గుర్తిస్తూ అతనికి 47 నేరాలు చేసినందుకుగాను ఒక్కొక్క కేసుకు 4 సంవత్సరాల జైలు శిక్ష చొప్పున 188ఏళ్లు శిక్ష విధించింది. దీంతో పాటు 47పోర్జరీ సంతకాలు చేసినందుకు ఒక్కొక్క నేరానికి 4 ఏళ్లు చొప్పున మరో 188సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నందుకు మరో ఏడేళ్లు శిక్షను పెంచింది. మొత్తం 95కేసుల్లో 383 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. వీటితో పాటు 3.32కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.

నిందితుడు కోదండపాణికి ప్రస్తుతం 82ఏళ్లు ఉండగా 7ఏళ్ల జైలుశిక్షను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు తీర్పుఇవ్వడంతో నిందితుడ్ని పోలీసులు జైలుకు తరలించారు. ఇన్ని సంవత్సరాల శిక్ష వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇత అతను బతికినంత కాలం జైలులోనే ఉండాలేమో.

Read more RELATED
Recommended to you

Latest news