మార్కెట్‌లో మనం ఇప్పటి వరకు దాదాపుగా ఎరుపు రంగులో గుజ్జు కలిగిన పుచ్చకాయలనే చూశాం. కానీ కర్ణాటకకు చెందిన ఆ రైతు మాత్రం పసుపు రంగు గుజ్జు కలిగిన పుచ్చకాయలను పండిస్తూ రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. కర్ణాటకలోని కలబురగి ప్రాంతం కోరలి గ్రామానికి చెందిన బస్వరాజ్ పాటిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కానీ వ్యవసాయం మీద మక్కువతో పంటలు పండించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతను పసుపు రంగు పుచ్చకాయలను పండిస్తున్నాడు.
పసుపు రంగు గుజ్జు కలిగిన పుచ్చకాయల పై భాగం సాధారణ పుచ్చకాయల్లాగే ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ లోపలి గుజ్జు మాత్రం పసుపు రంగులో ఉంటుంది. ఈ జాతిని సాంకేతికంగా సిట్రల్లస్ లనటస్ అని పిలుస్తారు. ఆఫ్రికాలో ఈ రకం పుచ్చకాయలు ఎక్కువగా పండుతాయి. వీటిల్లో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ రకం పుచ్చకాయలను ప్రస్తుతం తమిళనాడు, గోవాలలో పండిస్తున్నారు. అయితే బస్వరాజ్ కూడా తన చేనులో రూ.2 లక్షల పెట్టుబడితో ఈ పంట వేశాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతనికి ఈ పంటపై సుమారుగా రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వచ్చింది. ఇతను ఆ పుచ్చకాయలను అమ్మడం కోసం స్థానికంగా ఉన్న మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకున్నాడు. వారికి నేరుగా తన పండ్లను సరఫరా చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. వ్యవసాయాన్ని నూతన పద్ధతుల్లో చేయడంతోపాటు సంప్రదాయానికి భిన్నమైన పంటలను వేయడం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చని ఈ యువ రైతు చెబుతున్నాడు.