తెలంగాణలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకులతోపాటు అన్ని పార్టీల నాయకులు రోడ్డుపైనే ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు నేతలు. కానీ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికలు.. పార్టీ సభ్యత్వం నమోదు వంటి కార్యక్రమాలతో తమకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారట. అదే ఇప్పుడు అధికారపార్టీలో చర్చకు దారితీస్తోంది.
గెలవలేదన్న బాధో.. ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన ఏమో కానీ కీలక సమయంలో హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు అందుబాటులో లేకుండా పోయారు కొందరు నాయకులు. అలాంటి వారి లిస్ట్ తమ దగ్గర ఉందని చెబుతున్నారు పార్టీ పెద్దలు. గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుకున్నన్ని డివిజన్లలో విజయం సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో కొన్నిచోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చింది. వివిధ కారణాలతో పాత కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే గ్రేటర్ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్ పాగా వేసినా.. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి.. కార్పొరేటర్ అభ్యర్థులు సైలెంట్ అయ్యారట. ఇక మళ్లీ పోటీ చేసే అవకాశం రానివారైతే ఏమైయ్యారో.. ఎక్కడున్నారో తెలియదట.
ప్రతిసారి ఏదో ఒక సాకుతో తమను వాడుకుని పక్కన పెడుతున్నారనే అభిప్రాయంలో కొందరు నాయకులు ఉన్నారట. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారానికి, పార్టీ సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంటున్నామన్నది వారు చెప్పే మాట. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణి ప్రచారం చేస్తున్నా.. ఆ చుట్టు పక్కలకు కూడా రావడం లేదట ఆ నాయకులు. లోకల్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కలిసి ప్రచారం చేయడంలో స్థానిక నాయకుల సహకారం ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు వారే హ్యాండివ్వడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. పదవులు ఆశిస్తున్న మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు.. ఇదే సరైన సమయం అని భావించి.. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలదీస్తున్నారట. చేతిలో పదవి ఉంటే జనాల దగ్గరకు వెళ్లగలమని ముఖం మీదే చెప్పేస్తున్నరట.
గ్రేటర్ పరిధిలో 45 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఓడిపోయారు. ఆ ఎన్నికల వల్ల ఆర్ధికంగా కష్టాల్లో పడ్డామన్నది కొందరి వాదన. ఎన్నికల్లో ఓడిపోయాం.. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ.. పార్టీని వీడలేదు కదా.. అయినప్పటికీ గుర్తించరా అని నిలదీస్తున్నారట. వీరి వాదన ఎలా ఉన్నా… కీలక సమయంలో ఎన్నికల ప్రచారాన్ని, పార్టీ సభ్యత్వ నమోదును పట్టించుకోని వారిపై టీఆర్‌ఎస్ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. కీలక సమయంలో రూటు మార్చిన ఈ నేతల పై పార్టీలో సైతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.