సెకండ్​హ్యాండ్ కారు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల జీవనఅలవాట్లను మార్చేంది. కొవిడ్ తర్వాత చాలా మంది ప్రజారవాణాను వినియోగించడం తగ్గించి వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. అందుకే చాలా మంది వాహనాలు కొనుగోలు చేయడం షురూ చేశారు. స్తోమత ఉన్న వాళ్లు కొత్త కారు కొంటే మధ్యతరగతి వాళ్లు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పాత కారు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. లేకపోతే మోసపోయే అవకాశముంది. మరి సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..?

కొత్త వాహనం కొనుగొలు చేసినప్పుడు మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పాత కారు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, బీమా పాలసీ, కార్‌ ఇన్‌వాయిస్‌. ఈ పత్రాలను క్లియర్​గా తనిఖీ చేయాలి. ముఖ్యంగా సర్వీసు రికార్డుపై ఫోకస్ చేస్తే తరచూ వాహనాన్ని సర్వీసింగ్​కి ఇచ్చారా లేదాస బండి పార్ట్స్ ఏమన్నా మార్చారా, ఏమేం రిపేర్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది.

కారులో విండ్‌షీల్డ్‌ సహా ప్రతీ గ్లాస్‌పైన తయారీ ఏడాది, నెల ముద్రించి ఉంటుంది. అన్ని అద్దాలపై ఒకే తేదీ ఉంటే సరే. వేర్వేరు ఉంటే అద్దాలు మార్చారనీ, ప్రమాదం జరిగిందని గ్రహించాలి. డాష్‌బోర్డులో కనిపించే డ్యామేజీ ఏదైనా ఉందేమో చెక్‌ చేయాలి. దీన్ని బట్టే కారును సదరు యజమాని ఎంత బాగా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. హుడ్‌ను పైకెత్తి ఇంజిన్‌ బ్లాక్‌ను చెక్‌ చేయాలి. ఆయిల్‌ లీకేజీ ఏమైనా ఉందేమో గమనించాలి. కనిపించే లోహ భాగాలకు ఏమైనా తుప్పు పట్టిందా అని కూడా చూడాలి. కారులోని అన్ని ఎలక్ట్రిక్‌ భాగాలను పరీక్షించాలి. ముఖ్యంగా ఏసీ, పవర్‌ విండోలు, హెచ్‌వీఏసీ సిస్టమ్‌ను అడ్జస్ట్‌ చేస్తూ వేర్వేరు సెట్టింగ్స్‌లో సరిగా పనిచేస్తుందో లేదో చూడొచ్చు. మ్యూజిక్‌ సిస్టమ్‌కు సంబంధించి స్టీరింగ్‌పై ఉండే కంట్రోల్స్‌ను సరిచూడాలి.

వాహనం హుడ్‌, మిర్రర్లు, గ్రిల్‌, బానెట్‌, బంపర్‌, డోర్లు, విండ్‌షీల్డ్‌, బూట్‌.. ఇలా ప్రతిదీ క్లియర్​గా పరిశీలించాలి. డెంట్లు, తుప్పు పట్టడం, గీతలు పడటం ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే బేరం ఆడొచ్చు. బానెట్‌ తెరిచి హోసెస్‌, బెల్టులు, ఏసీ కాయిల్‌, రేడియేటర్‌, బ్యాటరీ, ఫ్యాన్‌ సరిగా పనిచేస్తున్నాయో లేదో గమనించాలి. వీటిలో ఏది చెడిపోయినా ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యం ఇంజిన్‌. దీని పనితీరు ఎలా ఉందో తెలియాలంటే తప్పనిసరిగా బండిని నడిపి చూడాలి. గేర్లు మార్చినప్పుడు, బ్రేక్‌లు వేసినప్పుడు, మూలమలుపుల్లో ఇంజిన్‌ నుంచి శబ్దాలు వస్తుంటే సమస్య ఉందని తెలుసుకోవచ్చు. న్యూట్రల్‌ గేరులో ఒకట్రెండు నిమిషాలు ఉంచినప్పుడు ఏవైనా వైబ్రేషన్లు, శబ్దాలు వస్తున్నా లోపం ఉందని అర్థం. యాక్సిలరేటర్‌, క్లచ్‌లు, బ్రేక్‌లు, బ్రేక్‌ పెడళ్లూ ఇవన్నీ చూడాలి.

లీటర్‌ ఇంధనంతో సగటున ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 15 కి.మీ నడిపితే.. మైలేజీపై ఓ అవగాహన వస్తుంది. అలాగే బండి కొని ఎన్నేళ్లవుతుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మరీ పాతదైతే.. విడి భాగాలు దొరకడం కష్టం.

కారుపై చిన్న డెంట్లు, స్క్రాచ్‌లు ఉంటే పెద్ద పట్టించుకోనవసరం లేదు. ఏదైనా భాగానికి రీపెయింట్‌ వేశారేమో చూడాలి. బంపర్లకు మళ్లీ పెయింట్‌ వేస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, లోహ భాగాలకు రీపెయింట్ వేస్తే దానికి పెద్ద ప్రమాదం జరిగిందని అర్థం. అలాగే తుప్పును దాచడానికీ అలా చేసి ఉండొచ్చు. టైర్లు సైతం కారు పరిస్థితేంటో చెబుతాయి. చౌక టైర్లు ఉంటే ఆ వాహనం జోలికి వెళ్లొద్దు.
మీరు కొంటున్న వాహనం ధర మార్కెట్‌లో ఎంత పలుకుతుందో చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో కాస్త వెతికితే.. మీరు కొనబోయే బండికి ఎంత వరకు చెల్లించొచ్చన్నది ఒక అవగాహన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news