వయస్సు చిన్నదైనా మనసు విశాలం. ఈ ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. పొంగల్ కానుకగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రూ.2,500 నగదు, చెరకు, పొంగల్ తయారీ పదార్థాల తో పాటు బట్టలను రేషన్ షాపుల ద్వారా అందించడం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలు సుబ్బలక్ష్మీ రేషన్ షాపుకు కాలి నడకన బయలుదేరింది. అయితే ఈమె కాస్త దూరం వెళ్లే సరికి ఓపిక లేకపోవడం, పైగా కాలికి గాయం కావడంతో ఒక చెట్టు కింద కూర్చుని ఉండిపోయింది. అలసిపోయిన ఈమె సాయం కోసం ఎదురు చూసింది. చాల సేపటి వరకు ఎవరు రాలేదు.
కాసేపటికే ఓ ఇద్దరు కవలలు వచ్చి ఆ అవ్వకు సహాయం చేశారు. నిజంగా వాళ్ళ మనసు ఎంత మంచిదో కదా..? స్థానికంగా అక్కడ ఉండే వనిత అనే గృహిణి మార్గ మధ్యన వెళ్తూ చెట్టు కింద కూర్చున్న ఈమెని చూసింది. తన కవల పిల్లలైన నితిన్, నితేశ్‌కు ఆ వృద్ధురాలికి సహాయం చేద్దామని చెప్పింది. వాళ్ళు కూడా ముందుకి వచ్చారు. మానవత్వంతో సహాయం చేద్దామని అనుకున్నారు. ఇలా ఆ వృద్ధురాలుని తోపుడు బండి పై పడుకోబెట్టి రేషన్ షాపునకు తీసుకెళ్లారు.
ఆమెని ఆ రేషన్ షాపు దగ్గర కిందికి దించి రేషన్ తీసుకునేలా చేసారు. ఇది అయిపోయాక తోపుడు బండి పై పడుకోబెట్టి ఆమెను ఇంటికి కూడా చేర్చడం జరిగింది. పండుగ నాడు వీళ్ళు చేసిన ఈ మంచి పని వైరల్ అయ్యింది. ఈ వార్త చూసిన వాళ్ళు అంత ఈ కవలలని మెచ్చుకున్నారు. నిజంగా వీళ్ళు చేసిన పనికి ప్రశంసల్ని ఇచ్చే తీరాలి.