విమాన ప్రయాణంలో ప్రయాణీలకు కొన్ని నిబంధనలు ఉంటాయి.. అవి మీకు నచ్చినా నచ్చకున్నా పాటించాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది సెల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం. లేదంటే ఫైట్ మోడ్ లోకి మార్చడం. విమాన ప్రయాణంలో ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి? అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
విమాన ప్రయాణాలు మొదలైన తొలి రోజుల్లో ఫోన్ల వల్ల విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయేదట. అందుకే విమాన ప్రయాణంలో ఫోన్లను ఆఫ్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చారు. కానీ… ప్రస్తుతం విమానాల సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విమానంలో ఫోన్ వాడడం వలన ఇప్పటి వరకు ఏ విమానం కూడా ప్రమాదానికి గురికాలేదు. అయినా, ఫ్లైట్ జర్నీలో మోబైల్ వాడకంపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.
ఫ్లైట్ జర్నీలో ఫోన్‌లు ఎందుకు ఆఫ్ చేయాలంటే..
విమానంలో ఫోన్ వాడటం మూలంగా ఫ్లైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు పెద్దగా ఇబ్బందులు రానప్పటికీ.. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడే సమయంలో కొంత నాయిస్ కలిగిస్తాయట. వెదర్ కండీషన్ సరిగా లేని సమయంలో వాయిస్ క్లారిటీగా రాకుండా అడ్డుపడతాయట. ఏటీసీ సందేశాలు స్పష్టంగా వినిపించక పైలట్లకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే లాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఆఫ్ చేయమని విమాన సిబ్బంది ప్రయాణీకులకు సూచిస్తారు.
సెల్ ఫోన్ల కారణంగా విమాన ప్రమాదాలు జరిగాయా?
సెల్ ఫోన్ సిగ్నల్ మూలంగా విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. ఒక్కోసారి పైలెట్లు ఈ సిగ్నల్స్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందట. అందుకే వీటి నుంచి తప్పించుకునేందుకు ఫోన్‌ను ఏరో ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ వాడకమే కారణమని భావిస్తున్నారు.
చైనాలో ఏకంగా జైలుకే..
పలు దేశాలు విమాన ప్రయాణాల్లో ఫోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టాయి. చైనా ప్రభుత్వం విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయకపోతే ఫైన్‌తో పాటు జైలు శిక్ష విధిస్తుంది.