కాసాని మార్క్: టీటీడీపీలో సంచలన మార్పు..!

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతూ వచ్చిన విషయం తెలిసిందే..90 శాతం నాయకులు, కార్యకర్తలు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. అయితే రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు ఏపీకి పరిమితం కావడంతో..తెలంగాణని పట్టించుకోలేదు.  ఇక అధ్యక్షులుగా పనిచేసిన ఎల్ రమణ, బక్కని నరసింహులు పార్టీపై పెద్దగా ఫోకస్ చేయలేదు.

ఏదో నామమాత్రం అధ్యక్షులుగానే ఉన్నారు. రమణ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయాక..అధ్యక్షుడుగా వచ్చిన బక్కని..చంద్రబాబుకు విధేయుడుగా ఉన్నారు గాని..పార్టీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి..తెలంగాణలో టీడీపీ ఉనికి కాపాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటివరకు బయటకురాని నేతలు, కార్యకర్తలు బయటకొస్తున్నారు. అటు కాసాని సైతం తనదైన శైలిలో పార్టీలో మార్పులు చేర్పులు చేబట్టారు.

ఇటీవల వరుసపెట్టి పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు..ఆయా స్థానాల్లో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపై నియోజకవర్గాల్లో ఎలా ముందుకెళ్లాలి..బలం ఎలా పెంచుకోవాలనే దానిపై చర్చలు చేస్తున్నారు. అలాగే పార్టీలో ఖాళీగా ఉన్న ఇంచార్జ్ పదవులు, అనుబంధ సంఘాల పదవులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. 119 స్థానాల్లో ఇంచార్జ్‌లు ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇకపై ప్రతి స్థానంలో టీడీపీ ఇంచార్జ్‌లు యాక్టివ్ గా తిరగడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ర్యాలీలు చేయడం లాంటివి చేసేలా ప్లాన్ చేశారు. ఎక్కడక్కడ టీడీపీ దిమ్మల దగ్గర టీడీపీ జెండాలు రెపరెపలాడలని సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా బలమైన నేతలకే నెక్స్ట్ సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు..అటు పార్టీలోకి వలసలు పెంచాలని చూస్తున్నారు. ఇతర పార్టీ ల్లో ఉన్న పాత టీడీపీ నేతలని తీసుకురావాలని చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో టీడీపీలో భారీ మార్పులు చేసేలా కాసాని ముందుకెళుతున్నారు.