తుమ్మల రాజకీయ భవిష్యత్తు ఏంటీ…?

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులలో ఒకరు ఖమ్మం జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో 2014 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన సమర్థుడు కావడంతో ఎమ్మెల్సీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రిని కూడా చేశారు. తనకిష్టమైన రోడ్లు భవనాల శాఖ ను తుమ్మల నాగేశ్వర రావు కి అప్పగించారు కేసీఆర్.

ఆ శాఖలో తుమ్మల కు మంచి అనుభవం ఉంది. అయితే 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పోటీ చేసి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మీద ఓడిపోయారు. ఆ తర్వాత కెసిఆర్ ఆయన మీద అభిమానంతో మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని పలువురు భావించినా, అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు కెసిఆర్. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావు ని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు కేసీఆర్.

 

దీంతో ఇప్పుడు తుమ్మల రాజకీయ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదే సమయంలో ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి బీజేపీ లోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. దీనితో తుమ్మల బీజేపీ లోకి వెళ్తారు అనే వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. ఏది ఎలా ఉన్నా గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన బిజెపి అధిష్టానం తుమ్మల విషయంలో ఫెయిల్ అయిందని, ఆయన టిఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చే అవకాశం లేదని పలుమార్లు స్పష్టంగా చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news