
తెలంగాణ ప్రజలకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన కింద తెలంగాణలోని బీబీ నగర్, తమిళనాడులోని మధురైలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 45 నెలల్లో ఏర్పాటు చేయనున్న చేయనున్న ఎయిమ్స్ వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎయిమ్స్ ఏర్పాటుతో 1500 ఓపీ, వెయ్యి మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశం లభించనుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.