తెదేపా నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తునారని వాటి మానుకోకపోతే తనదైన శైలిలో సమాధానం చెబుతానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… నన్ను ఎవ్వరూ కొనలేరూ… నేను ఏ పార్టీకి తొత్తుగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. తెదేపా నాయకులు తనను భాజపా దత్తపుత్రుడు అంటూ సంబోధించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి అవసరం అని భావించి నిస్వార్థంగా మద్దతిచ్చాను. నాడు తనను దేశభక్తుడిగా కీర్తించిన వారే ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు.
తెలంగాణలో, ఏపీలో తన అనుయాయులపై ఐటీ దాడి జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల 18 లక్షల ఓట్లను తెదేపా తొలగించిందని అందరూ మరోసారి ఓటు హక్కునమోదు చేసుకోవాలని కోరారు. జగన్, చంద్రబాబులు పరస్పరం కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం సమస్యను జాతీయస్థాయిలో చర్చిస్తానని ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్సోయిన వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు.