భారీ ఎత్తున మద్యం, పొగాకు ఉత్పత్తులు.. చిత్తూరు జిల్లాలో కలకలం

చిత్తూరు: జిల్లాలో భారీ ఎత్తున మద్యం, పొగాకు ఉత్పత్తులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 50 లక్షల విలువైన 9000 బాటిళ్ల మద్యాన్ని గుర్తించారు. 48 వేల గుట్కా ప్యాకెట్లు, కారు, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. చిత్తూరు రూరల్, తవణంపల్లి జి.డి.నెల్లూరు పోలీసు స్టేషన్ పరిధిల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. తవణంపల్లి పోలీసు స్టేషన్ పరిధి సాయి‌నగర్ వద్ద ఓ గోడౌన్‌లో నిర్వహించిన సోదాల్లో రూ. 10 లక్షల విలువ చేసే గోవా రాష్ట్రానికి చెందిన 3552 మద్యం బాటిళ్లను గుర్తించారు. రూ. 15 లక్షల విలువ చేసే 42 వేల హన్స్ గుట్కా ప్యాకెట్లు, 6 వేల విమల్ పాన్ మసలా పాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జి.డి.నెల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి చెందిన పొలములో సుమారు రూ. 24 లక్షల 15 వేల విలువ చేసే 3 వేల 818 మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో మద్యం, పొగాకు ఉత్పత్తులు దొరకడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇలాంటి పునరావృత్తమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.