మాజీ మంత్రి , వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో బెదిరించిన విషయం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు, ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ.. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదూ..ఇలాంటి చర్యలను ఎంతటి వారు ప్రోత్సహించినా సరే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వసంత నాగేశ్వరరావు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు కృష్ణా జిల్లా గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకట నరసింహారావు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. విధుల్లో భాగంగా గ్రామంలో గల వివిధ ఫ్లెక్సీలను తొలగింపు విషయంలో సెప్టెంబర్ 7 నాగేశ్వరరావు తనకు ఫోన్ చేసి ప్రభుత్వ ఏజెంటుగా వ్యవహరిస్తున్నావంటూ దూషించడంతో పాటు దేవినేని ఉమామహేశ్వర రావుని అవసరమైతే ఏదైనా చేస్తాం, కడప నుంచి ఇప్పటికే మనుషులు దిగారంటూ బెదిరించడాన్ని కార్యదర్శి ఫోన్లో రికార్డు చేశారు. వీటిని సైతం పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.