రేపటి నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం!

-

రాష్ట్రంలో ఓట్లు మిస్ అయిన వారికి, 18 ఏళ్లు నిండిన వారికి ఈసీ ఓటు నమోదు ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనుంది. లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే దిశగా ఎలక్షన్ కమిషన్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించనుందని, అందులో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది.

ఫిబ్రవరి 18 నాటికి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేయడంతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది ఓట్లు గల్లంతుకావడం, ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఓటర్లకు క్షమాపణ చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ఈసీ రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటుని గల్లంతు కాకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టనున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news