నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెదేపా నేతలు కేసు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీపార్వతి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాన పాత్రలుగా వర్మ నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి … ‘వెన్నుపోటు’ పాటను ఆయన నిన్న విడుదల చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ఈ పాట ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబును అవమానించేలా ఉండటంతో పాటు.. ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వర్మ వ్యవహరించడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
దీంతో దర్శకుడు వర్మతో పాటు నటీనటులు, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నిపుణులపై ఏపీ అంతటా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెదేపా నేత ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు పాటలో చంద్రబాబును చంద్రబాబు ఫొటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు.