నవరాత్రి దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైన సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవి నేడు ‘స్వర్ణ కవచాలంకృత దేవి’ గా దర్శనమిచ్చారు. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి రుత్వికులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. బాల భోగ నివేదనలు, నిత్యార్చనలు పూర్తయిన తరువాత ఉదయం 8 గంటలకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అనుకున్న సమయం కంటే గంట ముందుగానే అమ్మవారి దర్శనం కల్పించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.