రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రమ్మని డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆహ్వానించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తనతో చెప్పకుండా పన్నీర్ సెల్వం చేసిన ప్రకటనపై సీఎం పళనిస్వామి ఫైర్ అవుతున్నారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరుకుంటున్న దశలో శశికళ రాక పై అన్నాడీఎంకేలో విభేదాలు చిచ్చు రేపుతున్నాయి.
శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని పన్నీర్‌సెల్వం ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్‌తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవని, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని ఓపీఎస్ చెప్పారు.
పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ గా మారింది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడి ఆందోళన చెందుతున్నారు. శశికళ అంశంపై ఎలా వ్యవహరించాలా అని ఎడపాడి, పన్నీర్ సెల్వం రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం మొదలైంది. పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా శశికళకు ఆహ్వానం పంపారా అనే ప్రశ్న కూడా వస్తోంది. శశికళను అభిమానించే వారి ఓట్లను లక్ష్యం చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పన్నీర్-పళని మధ్య గతంలో విభేదాలు అందరికీ తెలిసిందే. ఐదేళ్ల అధికారం పూర్తి కావాలంటే ఇద్దరూ సమన్వయంతో పనిచేయాలని అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో పళనిస్వామి నాయకత్వాన్ని పన్నీర్ అంగీకరించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత.. శశికళ తమిళనాడు రాజకీయాలను శాసిస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైకు భారీ కాన్వాయ్‌తో చేరుకున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చాలా మంది చిన్నమ్మ చెంతకు వస్తారని అంతా భావించారు. అయితే అలాంటిదేమి జరగలేదు. కనీసం పది మంది ఎమ్మెల్యేలు కూడా చిన్నమ్మను ఆశ్రయించలేదు. దీంతో శశికళ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు.