ఆంగ్ల సంవత్సరాది అంటే ఎప్పుడో ప్రారంభమైంది.. కానీ తెలుగు ప్రజలకు మాత్రం కొత్త సంవత్సరం అంటే ఉగాది రోజే.. ఉగాదితోనే కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజున తెలుగు ప్రజల ఇండ్లన్నీ కళకళలాడుతుంటాయి. అందరూ ఉగాది పచ్చడి చేసుకుని తినడంతోపాటు ఉగాది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే అసలు ఉగాది రోజున ఏం చేయాలి ? ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలంకుని అభ్యంగన స్నానం చేయాలి. దీంతో లక్ష్మీ, గంగాదేవిల అనుగ్రహం పొందవచ్చు. అయితే సైన్స్ పరంగా చెప్పాలంటే.. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి పోషణ, ఆరోగ్యం కలుగుతాయి. ఇక అభ్యంగన స్నానం అంటే.. శరీరమంతా నూనెతో మర్దనా చేసి కొంత సేపు ఆగాక నలుగు పిండితో స్నానం చేయాలి. దీన్నే అభ్యంగన స్నానం అంటారు. ఇక ఇంటిని మొత్తం మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో ప్రత్యేకంగా మండపాన్ని సిద్దం చేసుకోవాలి. అందులో కొత్త సంవత్సర పంచాగాన్ని ఉంచాలి. పూజలు చేయాలి.
ఉగాది రోజు ఉగాది పచ్చడిని కచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అందులో వేపపూత, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు వేయాలి. ఇక కొందరు జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నెయ్యి వంటి వాటితో కూడా ఉగాది పచ్చడి చేస్తారు. అయినప్పటికీ షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఆరు రుచుల పదార్థాలు అందులో ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత కొత్త కుండ లేదా గిన్నెలో పచ్చడిని ఉంచి దాన్ని పంచాంగ పూజ అనంతరం నైవేద్యంగా పెట్టి.. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
ఇక ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్లి పంచాంగం వినాలి. దీంతో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తి తమకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఫలితాలు ఆ సంవత్సరం పొడవునా ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అయితే ఉగాది రోజున ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాది స్వీకారం, రాజ దర్శనం తదితర పూజలు చేస్తారు. ఆ రోజు ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించాలి. వ్యాపారులు కొత్త దస్త్రాలను పూజిస్తారు. దీంతో తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో అంతా శుభమే కలుగుతుందని వారు నమ్ముతారు. ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి..!