భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఏటీఎం లావాదేవీలపై ఆంక్షలు విధించింది. నిర్దేశించిన లావాదేవీల సంఖ్యను మించి ఏటీఎంల ద్వారా నగదు తీస్తే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని స్పష్టంచేసింది. వేతన ఖాతాదారులకు మాత్రం అపరిమిత సంఖ్యలో ఏటీఎంల ద్వారా లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు కల్పించింది.
అక్టోబర్ 31న కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఐటీఎస్ క్లాసిక్, ఏటీఎం మిస్టో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మొత్తం రోజుకు రూ.20వేలకు కుదించింది. ఇక కొత్తగా ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించింది. అవి త్వరలో అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఎస్‌బీఐ ఖాతాదారులు మెట్రో నగరాల్లో అయితే నెలలో ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకుల ఏటీఎంల నుంచి 5 సార్లు, మూడు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు లావాదేవీలు కొనసాగించవచ్చని స్పష్టంచేసింది. మెట్రో నగరాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే 5 సార్లు ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకు ఏటీఎంల నుంచి, 5 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. పరిమితికి లోబడి ఏటీఎంల లావాదేవీలు నిర్వహించాల్సిన ఖాతాదారులు అదనంగా నిర్వహించినట్లయితే ఒక్కో లావాదేవీపై రూ.5 నుంచి రూ.20 వరకు ఛార్జీలు వేస్తారు. ఈ మొత్తానికి జీఎస్టీ అదనంగా కలుపుతారు. బ్యాంకింగ్ రంగం సామాన్యుడికి మరింత చేరువ అవ్వాలని ప్రధాన మంత్రి ఓ వైపు ఆకాంక్షిస్తుంటే..మరో వైపు పరిమితులు, నిబంధనలను విధిస్తూ ఎస్బీఐ అనుసరిస్తున్న తీరు కస్టమర్లకు మింగుడు పడటం లేదు.