గత వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు, భారీ వరదలు కేరళను ముంచెత్తాయి. దీంతో కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. కేరళలో కల్లోలం సృష్టించింది. కేరళ కకావికలం అయింది. దాదాపు 80 శాతం కేరళ మునిగిపోయింది. లక్షల మంది భారీ వరదలకు నిరాశ్రయులయ్యారు. వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దీంతో కేరళలో ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది.
కేరళ కల్లోలానికి దాదాపుగా రూ. 15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అసోచామ్ నివేదిక ఇచ్చింది. ఆగస్టు 8 నుంచి 15 వరకు సాధారణ వర్షపాతం కంటే 250 శాతం అధికంగా కేరళలో వర్షాలు కురిశాయట. దీంతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్యాముల్లోకి వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరింది. సామర్థ్యానికి మించి వరద నీరు డ్యాముల్లో చేరడంతో నీటిని డ్యాముల నుంచి వదిలిపెట్టాల్సి వచ్చింది.
దీంతో భారీ వరదలు సమీపంలోని ఊళ్లను ముంచెత్తాయి. ఈ విపత్తు వల్ల కేరళ టూరిజం, పంటలు చెడిపోవడం, నౌకాశ్రయాలు దెబ్బతినడం, రోడ్లు, డ్యాములు, ఇండ్లు, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, విద్యుత్ వ్యవస్థ, టెలీఫోన్ వ్యవస్థ.. ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ దెబ్బతినడంతో మళ్లీ వీటన్నింటినీ పునరుద్ధరించడానికి చాలా సమయమే పడుతుందని అసోచామ్ తన నివేదికలో పేర్కొన్నది.