రాష్ట్ర వ్యాప్తంగా తెరాస కార్యకర్తల తో పాటు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల చూపులు నేటి తెరాస భవన్ లో జరిగే కార్యక్రమం వైపే ఉన్నాయి. తెలంగాణలో తొలి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఆయన తనయుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నారు. సోమవారం ఉదయం 10: 15 గంటలకు నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెరాస భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. 11.56 గంటలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
ఆ తరవాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారని మంత్రి తలసాని మీడియాకు స్పష్టం చేశారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని వెల్లడించారు. ఇప్పటికే సామాజిక మధ్యమాల ద్వారా మంత్రి కేటీఆర్ సమస్యలపై స్పందిస్తూ..తన దైన శైలిలో పనితీరుని ప్రదర్శించారు. వీటన్నింటికంటే తెలంగాణ యువతకు, తెరాస కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించడానికి కేటీఆర్ అనుసరించిన వ్యూహంతో తన రాజకీయ చతురతను చాటుకున్నారు.