విజయవాడ: అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావ దినోత్సంగా నిర్వహించాలని ఏపీ విద్యావంతుల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడలోని జై ఆంద్రా అమరవీరుల స్థూపం వద్ద జై ఆంధ్ర జెండాను ఎగురవేసింది. జైఆంధ్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించింది. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిన నాయకులు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 1, 1953 ఆంధ్రాకు పుట్టిన రోజు అయితే, నవంబర్ 1, 1956న తెలంగాణతో పెళ్లి రోజని అన్నారు. జూన్ 2 విడాకుల దినోత్సవమని… మనం ఏ దినోత్సవం జరపాలో ఆలోచించాలని ఆయన అన్నారు. పుట్టిన రోజు పండుగగా అక్టోబర్ 1న జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఖచ్చితంగా జెండా ఉండాలని చలసాని అన్నారు.