అమరావతి (గుంటూరు): వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ జెండాని జేబులో పెట్టుకొని వైసీపీ, జనసేన పనిచేస్తున్నాయిని ఆరోపించారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన జవహార్.. చిరంజీవి తన పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీకి రిటైల్‌గా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాప పరిహార యాత్ర 3వేల కిలోమీటర్లు దాటిందని, 30 వేల కిలోమీటర్లు పొర్లుదండాలు చేసినా జగన్ పాపం పోదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జవహార్ సవాల్ విసిరారు. కన్నా లక్ష్మీనారాయణకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.